ప్రభుత్వ ఉద్యోగులతో వైసీపీకి చిక్కులు..

Deekshitha Reddy
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల తీరు వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల ప్రచారంలో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు అనేక వరాలు ప్రకటించారు జగన్. అయితే అధికారంలోకి వచ్చాక వాటి అమలు మాత్రం వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. పీఆర్సీ అమలులోకి రాలేదు, సీపీఎస్ రద్దు వెనక్కి వెళ్లిపోయింది. ఇంకా చాలా రకాల డిమాండ్లు వినపడుతున్నా ప్రభుత్వం పట్టీ పట్టనట్టే ఉంది. దీంతో రెండేళ్లకు పైగా ఓపిక పట్టిన ఉద్యోగులు, ఇప్పుడు ఉద్యమబాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి అల్టిమేట్టం ఇచ్చారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలో సుదీర్ఘంగా ఆలోచిస్తోంది. ఈ విషయంలో పార్టీ ఆచితూచి ముందుకెళ్తోంది.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ సీజన్‌ సందర్భంగా డబుల్‌ బోనస్‌ రానుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. డీఏతోపాటు, ఈఆర్ పెంపుతో డబుల్ బోనస్ వస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పీఆర్సీ కూడా అమలులోకి రాలేదు. దీంతో ఏపీ ఉద్యోగులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఏ హామీని విడిచిపెట్టకుండా ముందుకెళ్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చాక ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకొని.. ఆర్టీసీ సంస్థను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఉద్యోగులకు కావాల్సిన అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే రెండేళ్లుగా పీఆర్సీకోసం వేచి చూసిన  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఇప్పుడు అసహనం కలుగుతోంది. దీంతో డిమాండ్ల సాధన కోసం పోరాటానికి సిద్ధమయ్యారు.
పీఆర్సీ ఇస్తే కష్టమేనా..?
ఇప్పటికే 1.34 లక్షలమంది సచివాలయాల ఉద్యోగులు తమను పర్మినెంట్ ఎప్పుడు చేస్తారా అని ఆలోచిస్తున్నారు. వారిని పర్మినెంట్ చేసిన తర్వాత పీఆర్సీ ఇస్తారా, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన తర్వాత సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఏది చేసినా.. వారి జీత భత్యాల ఖర్చు భారీగా పెరిగిపోతుంది. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడిందని అంటున్నారు. సచివాలయాల ఉద్యోగుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత పీఆర్సీ, సీపీఎస్ రద్దు విషయంలో ముందుకెళ్లాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: