కోట్ల.. మీరెక్కడా...?

Podili Ravindranath
కర్నూలు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతలు ఎవరూ అంటే ఠక్కున చెప్పే పేరు కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబం. రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి... తర్వాత ఆయన రాజకీయ వారసులుగా అదే కుటుంబం నుంచి ఆయన కుమారుడు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి, కోడలు సుజాతమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా కర్నూలు జిల్లాలో ఏకచక్రాధిపత్యంగా సాగింది కోట్ల హవా. రాష్ట్ర నాయకత్వంతో ఏ మాత్రం సంబంధం లేకుండా... నేరుగా ఢిల్లీ పెద్దలతోనే మంతనాలు జరిపే వారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చుట్టూ కాంగ్రెస్ నేతలంతా ప్రదక్షిణాలు చేస్తుంటే... కోట్ల కుటుంబం మాత్రం ఏ మాత్రం లెక్క చేయకుండా... జాతీయ స్థాయి నేతలతో నేరుగా పనులు చేయించుకునే వారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేసిన జయ సూర్య ప్రకాశ్ రెడ్డి... యూపీఏ సర్కార్‌లో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో కూడా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
అయితే ఇదంతా గతం. ప్రస్తుతం కోట్ల ఫ్యామిలీ ఎక్కడ ఉందో కూడా తెలియటం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కోట్ల... మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ... 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి... మళ్లీ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేశారు. అయితే ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చేతిలో ఏకంగా లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన భార్య సుజాతమ్మ కూడా ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి... ప్రస్తుత వైసీపీ మంత్రి జయరాం చేతిలో ఆమె ఓడారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొద్ది రోజుల పాటు ప్రెస్‌మీట్‌లంటూ హడావుడి చేసిన కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి... ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. కనీసం ఓ ప్రెస్‌నోట్ కూడా లేదు. జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా కూడా కోట్ల ఫ్యామిలీ కనిపించటం లేదు. అటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా కోట్ల కుటుంబం దూరంగానే ఉంది. కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ సోదరులను ఒప్పించి.. బుజ్జగించి మరీ కోట్ల ఫ్యామిలీని టీడీపీలోకి తీసుకువచ్చారు చంద్రబాబు. కానీ ప్రస్తుతం అధినేతకు కూడా అందుబాటులో లేకుండా పోయింది కోట్ల కుటుంబం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: