వైరస్ తోనే కాదు వ్యాక్సిన్ తోనూ సమస్యలేనా..?

NAGARJUNA NAKKA
ప్రస్తుతం 18సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరూ.. తప్పక తీసుకోవాల్సిన కోవిడ్ వ్యాక్సిన్ పై ఎన్నో అపోహలు.. తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం. ఈ వ్యాక్సిన్ తో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని కొందరు విశ్వసిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ అండాశయంలో పేరుకుపోదు.. అబార్షన్ కాదు.. మావిపైనా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిరభ్యంతరంగా వ్యాక్సిన్ వేయించుకోండి.
ఇక ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం అరుదని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా తీసుకున్న 220మందిపై పరిశోధన చేసి ఈ విషయం చెప్పారు. 50ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలోనే ఈ సమస్య రావొచ్చని.. 50వేల మందిలో ఒక్కరు మాత్రమే మరణించే అవకాశాలున్నట్టు తెలిపారు. ప్లేట్ లెట్ కౌంట్ తక్కువ ఉన్నవారికి.. మెదడులో రక్తస్రావం సమస్య ఉన్నవారికి కాస్త ఎక్కువ ప్రమాదమని పరిశోధకులు స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో కోవిడ్-19 చిన్నపిల్లల్లో సాధారణ జలుబులా మారిపోతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అయితే టీకాలు వేయించుకోని చిన్నారులపైనే ఈ వైరస్ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరోనా పిల్లలకు స్వల్పంగా సోకినప్పటికీ అంతగా ప్రభావం చూపలేదన్నారు. 10లక్షల మందిని చంపిన రష్యన్ ఫ్లూ వైరస్.. ఇప్పుడు 7 నుండి 12నెలల పిల్లలకు సాధారణ జలుబులా మారిందనీ.. కరోనా కూడా అలాగే తయారవుతుందని అన్నారు.
మరోవైపు కరోనా మూలాలపై మళ్లీ పరిశోధనలు చేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదనలను చైనా తోసిపుచ్చింది. జనవరిలో వైరస్ పుట్టుకపై ఇక్కడ చేసిన పరిశోధనలు సరిపోతాయనీ మళ్లీ అవసరం లేదని స్పష్టం చేసింది. మరోవైపు 40లక్షల మందికి పైగా మరణాలకు కారణమైన వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేయాల్సిందేనని అమెరికా సహా అనేక దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను డిమాండ్ చేస్తున్నాయి. ప్రజలు వైరస్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వైద్య నిపుణులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.  అంతేకాదు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: