దళారులను పోషిస్తున్న బాబు

Chowdary Sirisha
గద్దెనెక్కించిన యువతను మోసం చేస్తే వాళ్ళే గద్దెదింపగలరని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడును సీపీిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ నారాయణ హెచ్చరించారు. అధికారంలోకి వస్తే జాబ్‌లు ఇప్పిస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని బాబు పూర్తిగా మర్చిపోయారని, ఇప్పుడు బాబు వచ్చారు జాబ్‌లు పోయాయి అన్నట్లుగా ప్రైవేటు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిని అమలు పరుస్తూ మధ్య దళారీలను పెంచిపోషిస్తూ నిరుద్యోగ యువతకు మొండి చెయ్యి చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు ఎల్‌.గోవిందరావు, ముఖ్యకార్యదర్శి యు.వెంకటరామ్‌, కార్యదర్శి సి.సురేశ్‌ కుమార్‌ తదితరులు తమ డిమాండ్ల సాధనకై ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షను వారికి నిమ్మరసం ఇచ్చి నారాయణ విరమింపజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, కాంట్రాక్టు విధానం రద్దుతో పాటు ఇంకా అనేక వాగ్దానాలు చేశారని, ఆయన మాటలను విశ్వసించే యువకులు గద్దెనెక్కించారని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరుమాసాలు గడిచిపోయినప్పటికీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగ ఖాళీలలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతి ద్వారా భర్తీ చేస్తూ మధ్య దళారీలను పెంచి పోషిస్తూ ప్రజాధనాన్ని దగా చేయటం సమంజసం కాదని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్లు నారాయణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: