బీజేపీ వ్యతిరేక పార్టీల హవా !

NAGARJUNA NAKKA
జమ్మూ-కాశ్మీర్‌లోని  జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో గుప్కార్ కూటమి ఆధిక్యం సాధించింది. జమ్మూ రీజియన్‌లో బీజేపీ, కాశ్మీర్‌లో ఇతర పార్టీల ఆధిపత్యం కొనసాగింది. మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని అతి పెద్దపార్టీగా అవతరించింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన ఎన్నికల ఫలితాలు బీజేపీ వ్యతిరేక పార్టీల హవా కొనసాగింది.
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో గుప్కార్ కూటమి పుంజుకుంది. ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌కు కాశ్మీర్ ఓటర్లు అండగా నిలిచారు. మొత్తం 20 జిల్లాలోని 280 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో శ్రీనగర్ డివిజన్‌లో 113 స్థానాలకు గాను 88 స్థానాల్లో పీఏజీడీ కూటమి ఆధిక్యంలో ఉంది. జమ్మూ డివిజన్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.  శ్రీనగర్ డివిజన్‌లో కేవలం 3 స్థానాల్లో మాత్రం బీజేపీ ప్రభావం కనబడుతోంది. జమ్మూ ప్రాంతంలోని మొత్తం 108 స్థానాల్లో బీజేపీ 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాశ్మీర్ అభివృద్ధే తమ లక్ష్యం అంటున్నారు గెలిచిన అభ్యర్థులు.
పోలింగ్‌కు బ్యాలెట్ పేపర్లు ఉపయోగించడంతో ఫలితాలు రావడం ఆలస్యం అవుతోంది. శ్రీనగర్‌లోని ఒక స్థానంలో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ హెవీ వెయిట్‌ను తట్టుకుని బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం సంచలనం రేపింది. గెలిచిన బీజేపీ అభ్యర్థులకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అభినందనలు తెలిపారు. కాశ్మీర్‌లో ప్రశాంతత, అభివృద్ధే తమ లక్ష్యం అంటున్నారు బీజేపీ నేతలు
దక్షిణ కాశ్మీర్‌లో గుప్కార్ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గుప్కార్ కూటమి కింద ఏడు పార్టీలు కలిసి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో పోటీ చేశాయి. కాంగ్రెస్ ఈ కూటమికి మద్దతు ప్రకటించినా ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకోదగిన స్థానాల్లో విజయం సాధించింది. గుప్కార్ కూటమి ఎన్నికల్లో గెలవడంతో ఆర్టికల్ 370ని కొనసాగించాలనే డిమాండ్ ఊపందుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: