భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం

NAGARJUNA NAKKA

భారీ వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేశాయి.  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండడంతో వివిధ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. మరోవైపు, ఎగువున కురుస్తున్న వర్షాలతో... రిజర్వాయర్లకు వరదనీరు వచ్చి చేరుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 


భారీ వర్షాలతో సిక్కోలు తడిసిముద్ద అయ్యింది. శ్రీకాకుళం జిల్లా అంతటా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకూ ఎక్కడిక్కడ వాగులు పొంగి పంటపొలాలను ముంచెత్తాయి.  బహుదానదికి భారీగా వరదనీరు పోటెత్తింది. వరద ఉధృతి పెరుగుతుండటంతో ఇచ్ఛాపురం పాత బ్రిడ్జి నుంచి భారీగా నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నదీపరీవాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మహేంద్రతనయ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కవిటి, సోంపేట మండలాల పరిధిలోని బీల ప్రాంతంలో పంటపొలాలు ముంపుకు గురయ్యాయి. వంశధార వయాడక్ట్ వర్షాలకు నిండిపోవడంతో నీరంతా పొంగిపొర్లుతోంది. దీంతో అక్కడి నుంచి వెళుతున్న స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


విజయనగరం జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు కురిశాయి. భోగాపురంలో అత్యధికంగా 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.  తోటపల్లి కెనాల్ కు గండిపడటంతో పంటపోలాలు నీట మునిగాయి.  ఏడువంపుల గెడ్డ,  గుమ్మడిగెడ్డ పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాలూరు, బొబ్బిలి, ఎస్ కోటతో పాటు జిల్లాలో వేలాది ఎకరాల్లో... పత్తి ,మొక్కజొన్న,వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సీతానగరం వద్ద  సువర్ణముఖి నదిపై వంతెన డ్యామేజ్ కావటంతో పార్వతీపురం, ఒరిస్సా వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.  ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇంకా జిల్లాలోని పలుప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. 


భారీ వర్షాలకు ఉక్కునగరం విశాఖపట్నం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరమంతా చెరువులా మారింది. మాడుగుల నియోజకవర్గాలలో ఉన్న మధ్యతరహా సాగు నీటి ప్రాజెక్టుల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిపడుతుండటంతో పెద్దేరు, రైవాడ, కోనాం,లోవ జలాశయాల నుంచి వరద నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: