ఏపీ మంత్రి వర్గం తీసుకునే నిర్ణయాలు ఇవే!

NAGARJUNA NAKKA
మరిన్ని సంక్షేమ పథకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే ఎజెండాగా బుధవారం ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది.  కీలక కార్పోరేషన్లు, బోర్డుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఎన్నికల నిర్వహణకున్న సాంకేతిక అడ్డంకులను అధిగమించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 


కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. చేనేత కార్మిక కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయానికి ఆమోదం తెల్పనుంది. చేనేత కార్మిక కుటుంబాలకు 24 వేల రూపాయల మేర ఆర్థిక సాయం అందివ్వాలని సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఇప్పటి వరకు కేబినెట్ ఆమోదం పొందలేదు. దీంతో బుధవారం నాటి మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించనున్నారు. 


మత్స్యకారుల సంక్షేమం విషయంలో మరో నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలకు నాలుగు వేల రూపాయల మేర ఆర్థిక సాయం అందించేవారు. ఆ మొత్తాన్ని పది వేల రూపాయలకు పెంచడానికి కెబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక డ్వాక్రా మహిళల కోసం గతంలో వెలుగు పేరుతో పథకం ఉండేది. ఇప్పుడు ఆ పథకం పేరును వై.ఎస్.ఆర్ క్రాంతిపథంగా మార్చారు. దీనికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.


ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయనుంది. ఇందుకోసం ఔట్‌ సోర్సింగ్‌ కార్పోరేషన్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే పాఠశాలల అభివృద్ధికి మన బడి నాడు-నేడు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీనిపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే కొంత మేర ప్రణాళికలు కూడా సిద్దం చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లపై చర్చించే అవకాశం ఉంది. వివాదంగా ఉన్న పోలవరం, రాజధాని నిర్మాణం, పీపీఏల వంటి అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ కన్పిస్తోంది. మొత్తం 15 అంశాలతో కూడిన అజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: