దేశాన్ని కుదిపేస్తున్న టీడీపీ నిర్ణయం..! తొలిసారి అంతర్మథనంలో మోదీ..!!

Vasishta

దేశ రాజకీయాల్లో టీడీపీ నిర్ణయం ఓ కుదుపు..! మోదీ సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలంటూ టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని పలు రాజకీయ పార్టీలు స్వాగతించాయి. నిన్నటివరకూ ఎన్డీయేలోనే ఉన్నామన్న టీడీపీ ఊహించని విధంగా ఆ కూటమి నుంచి బయటికొచ్చి.. ఏకంగా మోదీ సర్కార్ పై అవిశ్వాసానికి సిద్ధమైంది.


          ఒక్క నిర్ణయం.. ఎన్నో పరిణామాలు..! ఎన్డీయే నుంచి బయటికి రావాలన్న చంద్రబాబు నిర్ణయం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఉదయం నుంచి జాతీయ మీడియా మొత్తం ఇదే అంశంపై చర్చిస్తోంది. చంద్రబాబు నిర్ణయం మోదీ సర్కార్ కు ఇబ్బందేనంటూ కథనాలు ప్రసారం చేస్తోంది.


మరోవైపు.. టీడీపీ అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకోగానే దానికి కాంగ్రెస్, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం స్వాగతించారు. సాయంత్రంలోపు నిర్ణయం తీసుకుంటామని శివసేన ప్రకటించింది. అకాలీదళ్ మాత్రం తాము దూరంగా ఉంటామని తెలిపింది. ఇప్పటివరకూ మొత్తం 7 పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, అన్నాడీఎంకే, తృణమూల్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, ఆప్ మద్దతు ప్రకటించాయి. టీడీపీ అవిశ్వాసాన్ని పూర్తిగా స్వాగతించిన మమత బెనర్జీ, ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే విషయం వెల్లడించారు.


నిన్నటిదాకా టీడీపీ ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోని బీజేపీ సర్కార్.. ఈరోజు అంతర్మథనంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబును బుజ్జగించేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీపై బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. టీడీపీ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే తమపై బురదజల్లుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జి.వి.ఎల్. నరసింహారావు విరుచుకుపడ్డారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: