లేట్ నైట్ పార్టీలోద్దు.. ట్రైనీ ఐపీఎస్ లతో బాలివుడ్ నటుడు...!!

Shyam Rao

అర్ధరాత్రి వరకు జరిగే విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని, ఆరున్నర గంటలలోపే డిన్నర్ ముగించుకోవాలని ప్రొబేషనరీ ట్రైనీ ఐపీఎస్‌లకు బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ సూచించారు. ట్రైనీ ఐపీఎస్‌లకు మార్షల్ ఆర్ట్స్‌లో మెళకువలు నేర్పేందుకు అక్షయ్‌కుమార్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమీకి వచ్చారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసు అకాడమీలో బిజీబిజీగా గడిపారు. శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లకు శరీరాన్ని ఏ విధంగా పటిష్ఠంగా ఉంచుకోవాలనే అంశాలకు సంబంధించిన పలు ఆరోగ్య సూత్రాలను ఆయన వివరించారు. ప్రతీ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకే రాత్రి భోజనాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.

 

లేట్‌నైట్ పార్టీలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలని సలహా ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్ స్వీయ రక్షణతోపాటు శారీరక వ్యాయమానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. అనంతరం బాలీవుడ్ స్టార్ 120 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌లు, మిడ్‌కెరీర్ ట్రైనింగ్ ఐపీఎస్‌లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాయామాలను దశల వారీగా మారుస్తూ కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

తనకు పోలీసులన్నా.. పోలీసు వృత్తి అన్నా అత్యంత గౌరవమని, అందుకే పోలీసులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి వస్తే వారికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానని వివరించారు. వ్యాయామంతో శారీరక పటుత్వమేకాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. అనంతరం ట్రైనీ ఐపీఎస్‌లతో వాలీబాల్ ఆడటంతోపాటు మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో పాల్గొన్నారు. అక్షయ్‌కుమార్‌ను ఎన్‌పీఏ డైరెక్టర్ అరుణాబహుగుణ, ఇతర ఉన్నతాధికారులు మెమెంటో బహూకరించి సత్కరించారు. అక్షయ్‌కుమార్ రాకతో ఎన్‌పీఏలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: