అమెరికా దేశంలో నేరం చేసి తప్పించుకోవడమనేది అసాధ్యం. అడుగడుగునా సీసీటీవీలు.. గ్రామ స్థాయిల్లోనే పోలీసుల డ్యూటీలు.. అక్కడ వాడే టెక్నాలజీ.. ఇలా అన్ని భద్రతలు నేరగాళ్లను గంటల వ్యవధిలో పట్టిస్తాయి. ఇక అక్కడి న్యాయవ్యవస్థ కూడా నెలల సమయంలోనే దోషులకు శిక్ష విధిస్తుంటుంది. చిన్న నేరం చేసినా కటకటాల పాలు కావడం ఖాయం. కానీ పదమూడేళ్ల క్రితం జరిగిన 24ఏళ్ల ఎన్నారై యువతి హత్య విషయంలో నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. విస్తుపోయే అంశం ఏంటంటే.. ఆమెను ఎవరు హత్య చేశారనే విషయాన్ని కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. కాగా ప్రస్తుతం ఆమె మర్డర్ మిస్టరీ మరోసారి అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.
ఎవరా అమ్మాయి.. ఎలా హత్యకు గురైంది..
హత్యకు గురైన యువతి పేరు అర్పణా జినగా. భారతదేశానికి చెందిన ఈమె ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్ళింది. తన ప్రతిభతో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. మంచి ఉద్యోగం మంచి వేతనంతో ఆమె తన జీవితాన్ని ఎంతో సంతోషంగా కొనసాగించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో అర్పణా వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్‌మండ్ సీటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉండేది. ఈమె బైక్ రైడింగుకు చాలా పెద్ద ఫ్యాన్. వీలు చిక్కినప్పుడల్లా బైక్ రైడింగ్ చేయడానికి బాగా ఇష్టపడుతుండేది.
అయితే 2008 అక్టోబర్ 31వ తేదీన అర్పణా నివసిస్తున్న అపార్ట్‌మెంట్ కాంపెక్ల్స్‌లో ఒక పార్టీ జరిగింది. ఈ పార్టీకి అర్పణా కూడా హాజరైంది. బైక్ రైడర్లు ధరించే బట్టలతో ఆమె పార్టీకి వచ్చి బాగా సందడి చేసింది. ఎంతో హుషారుగా అందరితో కలిసి ఎంజాయ్ చేసింది. కానీ మరుసటి రోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఘోరాతి ఘోరంగా చంపేశారు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ బిడ్డకు ఫోన్ చేసారు కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఫ్యామిలీ ఫ్రెండ్ కి సమాచారం అందించగా వారు అర్పణా అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఎంతసేపు పిలిచినా.. తలుపు తట్టినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఆమె శవం గా కనిపించింది. ఒంటిపై నూలు పోగు లేకుండా కుళ్లిపోయిన ఆమె శవం చూసి సదరు ఫ్యామిలీ ఫ్రెండ్ దిగ్భ్రాంతికి గురయ్యారు.
సమాచారం అందుకున్న అమెరికా పోలీసులు అర్పణ భౌతికకాయానికి పోర్ట్‌మార్టం చేయించి విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. హత్యకు ముందు అర్పణ అత్యాచారానికి గురైందని తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2010లో ఇమ్మాన్యూయల్ అనే యువకుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసు పూర్వాపరాలు పరిశీలించి ఇమ్మాన్యూయల్ నిర్దోషి అని న్యాయస్థానం తేల్చింది. దాంతో అతడు 2019లో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.
అయితే ప్రస్తుతం ఒక జర్నలిస్టు అర్పణా జినగా హత్య కేసు చేధించేందుకు సిద్ధమయ్యారు. ఆమె గురించి స్పెషల్ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తూ.. అన్ని వివరాలను సేకరిస్తున్నారు. దాంతో అర్పణా మర్డర్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్ అయింది.