ఇండియన్ హాకీ ప్లేయర్‌కు కోటి రూపాయల నజరానా..?

Suma Kallamadi
41 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. భారత జాతీయ క్రీడ హాకీలో పతకం సాధించడంతో కోట్లాది భారతీయులు ఆనందంలో మునిగితేలారు. ఈ చారిత్రాత్మక విజయంలో ఇండియన్ టీమ్ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్ పాత్ర ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గోల్‌ పోస్టుకు ఒక గోడలా నిలిచి జర్మనీ జట్టుకి గోల్స్ రాకుండా చేశాడు. అతని కృషి, ప్రతిభ వల్లే ఈరోజు ఇండియన్ హాకీ టీమ్ జర్మనీ పై గెలిచి ఒలింపిక్స్‌లో మెడల్ పట్టేసింది. అందుకే గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్ ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు అతని ఆట ప్రదర్శనను పొగుడుతూ బహుమతులు ప్రకటిస్తున్నారు. భారత మూలాలున్న దుబాయ్ పారిశ్రామికవేత్త ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించారు.
భారత పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్‌ శ్రీజేష్ కోసం ఒక కోటి నగదు బహుమతి ఇస్తున్నట్లు షంషీర్ వయలీల్ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయులను శ్రీజేష్ ఆనందంతో ముంచెత్తాడని ఆయన అన్నారు. శ్రీజేష్ కి తోటి మలయాళీగా తాను గర్వపడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. దుబాయ్ లోని VPS హెల్త్‌కేర్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా షంషీర్ వయలీల్ కొనసాగుతున్నారు. హెల్త్‌కేర్ పారిశ్రామికవేత్తగా ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
తనకు రూ.1 కోటి రివార్డ్ ప్రకటించడంతో శ్రీజేష్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ బహుమతికి గ్రహీత కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని శ్రీజేష్ అన్నారు. 2000 కాలంలో జూనియర్ జాతీయ హాకీ జట్టులో అడుగుపెట్టిన తన ప్రతిభతో శ్రీజేష్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. తక్కువ వ్యవధిలోనే మంచి హాకీ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న అతను 2016 లో జాతీయ జట్టు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. టోక్యో ఒలంపిక్స్ లో గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ గా నిలిచి కాంస్యం పట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: