న్యూజెర్సీ: ఎస్పీబీ పేరిట స్వచ్ఛంద సంస్థ..!

Suma Kallamadi
దివంగత నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25, 2020 సంవత్సరంలో తన తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణించడం సంగీత ప్రపంచానికి తీరని లోటు అంటూ సంగీత ప్రియులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొందరు ఎస్పీబీ మరణవార్తను జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ ఆయన పాటలు వింటూ ఆయనను తలుచుకునే వారు ఎందరో ఉన్నారు. భారతీయ సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఎస్పీబీ సంగీతం ఉన్నంతకాలం గుర్తుండిపోతారు. అయితే కొందరు వీరాభిమానులు ఎస్పీబీ పేరిట చారిటీ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎస్పీబీ పేరు మీద జూన్ 27వ తేదీన అమెరికాలోని న్యూజెర్సీలో ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ అనే ఓ స్వచ్ఛంద సంస్థను అభిమానులు ఏర్పాటు చేశారు. ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ(ఎస్‌పీబీఎంఐ) లాంచింగ్ ఈవెంట్ ని న్యూజెర్సీలో రాయల్ ఆల్‌బర్ట్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది అతిథులు విచ్చేసారు. కాగా, వేలాది మంది అభిమానులు ఎస్‌పీబీఎంఐ ప్రారంభోత్సవ ఈవెంట్ ని టీవీలలో, సోషల్ మీడియాలో వీక్షించారు.
ఎస్‌పీబీఎంఐ సంస్థ ఏర్పాటు చేసిన ఛైర్మన్ శ్రీనివాస్ గూడూరు, ప్రెసిడెంట్ భాస్కర్ గంటి తదితరులు ఈ సంస్థను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటో వివరించారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచ అన్ని దేశాల్లో సింగింగ్ కాంపిటీషన్లు, మ్యూజిక్ వర్క్‌షాప్‌లను నిర్వహించి.. ప్రతిభ ఉన్న గాయనీ గాయకులను వెలికి తీస్తామని చెప్పుకొచ్చారు. ఈ సంస్థకి ముఖ్య సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ పాలసీతో తమ సంస్థ తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్‌పీబీఎంఐ సంస్థతో కలిసి తాను పని చేస్తానని ఆయన ఈ సందర్బంగా వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో తనకున్న అనుభవం ఉపయోగించి సంస్థకు మార్గనిర్దేశనం చేస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: