అమెరికాలో ఎన్నారై కుటుంబం గల్లంతు..?

Suma Kallamadi
జూన్ 24వ తేదీన ఫ్లోరిడాలోని మియామీలో 12 అంతస్థుల నివాస భవనం కుప్పకూలింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత వందల మంది గల్లంతయ్యారు. తాజాగా ఫ్లోరిడా పోలీసులు మాట్లాడుతూ ఇంకా 150 మంది భవన నివాసులు ఆచూకీ తెలియాల్సి ఉందని వెల్లడించారు. అయితే ఈ 150 మందిలో ఒక భారతీయ కుటుంబం కూడా ఉందని పోలీస్ అధికారులు వెల్లడించారు. భారత సంతతికి చెందిన 42 విశాల్ పటేల్ తో పాటు ఆయన భార్య భావన(38) ఆచూకీ గల్లంతైనట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఏడాది వయసున్న విశాల్ పటేల్ కుమార్తె ఐషాని పటేల్ ఆచూకీ కూడా తెలియడం లేదని పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే విశాల్ పటేల్ మేనకోడలు సరీనా పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. ఫాదర్స్ డే రోజు విశాల్ పటేల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశానని.. అప్పుడు తనని ఇంటికి రమ్మని పిలిచారని కానీ కరోనా ఆంక్షల వల్ల తాను వెళ్ళలేకపోయానని చెప్పుకొచ్చారు. అయితే ప్రమాదం జరిగిన సమయానికి తన అత్తయ్య భావన పటేల్ నాలుగు నెలల గర్భవతి అని ఆమె వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే తాను తన అత్తమామలకు ఫోన్ చేశానని కానీ ఎటువంటి స్పందన లభించలేదని ఆమె అన్నారు. తనకు తెలిసిన వారందరినీ కాంటాక్ట్ అయ్యానని కానీ వారి ఆచూకీ లభ్యం కాలేదని ఆమె తెలిపారు.
ఇకపోతే భవనంలో మొత్తం 136 యూనిట్లు ఉండగా.. వాటిలో 55 యూనిట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో అదేరోజున ఐదుగురు నివాసితులు మృత్యువాత పడ్డారు. అయితే ఆదివారం వరకూ అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 9కి చేరుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. అలాగే మిస్సయిన 150 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఐతే దుర్ఘటన ని అమెరికా చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: