బాలు గురించి ఓ ఎన్నారై అద్భుత పోస్ట్... !
నువ్వు, నేను, నా పక్కవాడు... ఎవరు లేకపోయినా సృష్టి యథావిధిగానే, అందంగానే ఉంటుంది. కానీ నువ్వు తోడుంటే సూర్యోదయాలు, సంజకెంజాయలు, చలినెగళ్ళు, కిటికీ ఆవల వానచినుకులు, నవారు మంచం మీద కురిసే వెన్నెల, ప్రహరీ దగ్గరి జాజిపందిరి... అన్నీ ఇంకా ఇంకా అందంగా కనబడతాయి. ఇంకా వర్ణమయంగా కనబడతాయి. ఎంతందంగా అంటే నీ పాటంత అందంగా. అసలు నీలాగా కాలానికి రంగులద్దిన పాటనేతగాడు మా తరాల్లో ఇంకెవరూ లేరు.
పాడి నువ్వేం సంపాదించావో, వృత్తిస్పర్ధలు ఎలా ఉండేవో, నువ్వు మంచోడివో కాదో, అనుకున్నంత మంచోడివి కాదో, నీ ముందరి పాతగొంతులు, నీ తరువాయి కొత్తగొంతుల్లో ఏవి మేలైనవో, ఎవరి స్వరాలకి శాస్త్రీయ సంగీతపు రంగు-రుచి-వాసన ఉన్నాయో, నీకున్నాయో లేవో నాకనవసరం! నాకెప్పుడు కావాలంటే అప్పుడు.. వేళాపాళా లేకుండా తలుచుకోగానే, ఏ వివరమూ అడగకుండా నా తోడుగా వచ్చే నేస్తుడివి నువ్వు. అంతకంటే ఇంకేం కావాలి నిన్ను పిచ్చిగా ఇష్టపడ్డానికి ? ఇప్పటిదాకా పాటల రెక్కలమీద మమ్మల్నెక్కించి అన్ని మంత్రలోకాలూ తిప్పుతూనే ఉన్నావు. విసుగేసిందో ఏమో ఈసారి మాత్రం నువ్వొక్కడివే ఆ రెక్కల మీదెక్కి తుర్రుమని వెళ్ళిపోయావు. ఇకపైన నువ్వు నాకు తోడుగా వచ్చేప్పుడు కొత్త రాగమేదీ తీసుకురావు అనేదొక్కటే వెలితి. మేమున్న కాలంలో నువ్వు పాడావని, నువ్వు పాడిన కాలంలో మేము విన్నామని చెప్పుకోవడం ఇకపై మా తరానికే ఒక విలువ! అందుకే, ఐ విల్ నాట్ మిస్ యూ దోస్త్ !