తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. వైవిధ్యమైన కథాంశాలను ప్రేక్షకులు కోరుకుంటుండటంతో వారికి నచ్చే రీతిలో సినిమా తీయడానికి దర్శక నిర్మాతలు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. కొంచెం ఖర్చు ఎక్కువైనా విభిన్న సినిమాలు తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండటం విశేషం.
ఇందులో భాగంగా ఇటీవల తెరపై భక్తిరస చిత్రాల జోరు ఎక్కువైందని చెప్పాలి. ఈ తరహా చిత్రాల్లో నటించడానికి బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర కథానాయకులు ఆసక్తి చూపిస్తుంటడంతో దర్శక నిర్మాతలు కూడా భక్తి రస చిత్రాలు గురించి ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కీరవాణి సంగీత సారథ్యంలో నాగార్జున తహీరోగా నటించిన ‘షిరిడీ సాయి’ తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. అంతకుముందు ఈ త్రయం కాంబినేషన్ లో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాల స్ఫూర్తితో ‘షిరిడిసాయి’ చిత్రానికి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ఆడియోకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇక బాపు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన శ్రీ రామరాజ్యం చిత్రం అనుకున్నంతమేర విజయం సాధించనప్పటికీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయింది. నేటికీ ‘శ్రీరామదాసు’ పాటలు ప్రేక్షకుల మదిలో నానుతూనే ఉన్నాయి. అలాగే డాక్టర్ మోహన్ బాబు వంటి ప్రముఖులు ప్రత్యేక పాత్రలు పోషించిన ‘ఆదిశంకరాచార్య’ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
దర్శకుడు అల్లాని శ్రీధర్ ఏకంగా రెండు భక్తిరస చిత్రాలను రూపొందిస్తున్నారు. ఒకటి హనుమాన్ చాలీసా, రెండు చిలుకూరు బాలాజీ..ఈ రెండు సినిమాలు కూడా వచ్చే రెండు నెలల కాలంలో విడుదల కానుండటం విశేషం. అలాగే మీనా టైటిల్ పాత్రని పోషించిన ‘శ్రీ వాసవి వైభవం’ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రాల సంగతి అలా ఉంచితే డాక్టర్ మోహన్ బాబు సొంత బ్యానర్ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్ పతాకంపై ‘రావణ బ్రహ్మ’ పేరుతో భారీ వ్యయంతో భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించనున్నారు అదేవిధంగా ‘విప్రనారాయణ’ అనే చిత్రాన్ని మళ్లీ తీయాలనే ఆలోచనలో మరో నిర్మాత ఉన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: