ఎడిటోరియల్ : తప్పు చేయలేదా..? ఎదుర్కోగలమనే ధైర్యమా..? ఎందుకంత కాన్ఫిడెన్స్..?

Vasishta

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రాగానే చాలా మంది దాన్ని లైట్ తీసుకున్నారు. కారణం గతంలో కూడా ఈ వ్యవహారం వెలుగుచూడడమే.! పైగా సినీ నటులకు ఇవన్నీ కామనేగా.. అనుకున్నారు. చాలా మంది నటీనటులు, ఇతర ప్రముఖులకు డ్రగ్స్ తీసుకునే అలవాటుందని ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. అయితే ఎవరూ బయటపడేవారు కాదు. ఇప్పుడు కూడా వాళ్లంతటవాళ్లు బయటపడలేదు. స్కూల్ పిల్లల డ్రగ్స్ వ్యవహారంతో ఈ డొంక కదిలింది.

 

విచారణకు వెళ్తున్నారు సరే.. వారిలో కొంచెం కూడా ఆందోళన కనిపించడం లేదు. చాలా ధీమాగా ఉన్నారు. సిట్ నోటీసులు అందుకున్నారు. నోటీసుల్లో పేర్కొన్న విధంగానే విచారణకు హాజరవుతున్నారు. అధికారులు చెప్పిన ఆదేశాలు పాటిస్తున్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు వస్తామంటున్నారు. ఎలాంటి పరీక్షలకైనా వెనుకాడేది లేదన్నారు. అడిగిన వెంటనే రక్త నమూనాలను ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకూ విచారణకు హాజరైన నలుగురూ కూడా ఇదే ధీమాతో ఉన్నారు.

  

          పూరీ జగన్నాధ్ విచారణకు వెళ్లేటప్పుడు చాలా ధీమాగా కనిపించారు. 11 గంటలపాటు విచారించిన తర్వాత కూడా పూరీ ఇంటికొచ్చి ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తనకు తెలిసిన అన్ని విషయాలను సిట్ అధికారులకు వివరించానని, అవసరమైతే మళ్లీ విచారణకు వెళ్తానని చెప్పాడు. పూరీలో ఎక్కడా తాను తప్పు చేశాననే భావన కనిపించలేదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అలాగే.. పూరీ గ్యాంగ్ లో మరో కీలక వ్యక్తి శ్యాం కె నాయుడు కూడా చాలా తాపీగా వెళ్లాడు.. అడిగినవాటన్నిటికీ ఆన్సర్స్ చెప్పి వచ్చాడు.

 

          సుబ్బరాజు అయితే తనకు కనీసం ఇంగ్లీష్ మందులు కూడా వాడనన్నాడు .. అలాంటింది డ్రగ్స్ తీసుకోవడమా.. హవ్వ.. అని నోరెళ్లబెట్టాడు. కూల్ గా వెళ్లాడు.. సాయంత్రం వరకూ తనకేం తెలీదన్నాడు. చివరకు గట్టిగా ప్రశ్నించడంతో నోరు తెరిచి మొత్తం చెప్పేశాడు. తప్పు ఒప్పుకున్నాడు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదంటూ.. పూరికి వాటిని తెచ్చి ఇచ్చినట్లు అంగీకరించాడు. తరుణ్ అయితే అసలు ఆ పాపంతో తనకేం సంబంధం లేదన్నాడు. చెడ్డపేరు వస్తుందని పబ్ ను కూడా అమ్మేశానన్నాడు. తనది చాలా విలువలతో కూడిన కుటుంబమని.. ఇలాంటి తప్పుడు పనులేమీ చేయన్నాడు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా ఉపవాసం ఉన్నానన్నాడు. పాపం.. అధికారులు స్పెషల్ గా యాపిల్ తెచ్చి ఇచ్చారు.

 

          విచారణకు రాబోయే వాళ్లలో కూడా ఏమాత్రం బెరుకు కనిపించట్లేదు. చాలా హుందాగా నోటీసులు అందుకున్నారు. తాము తప్పు చేయలేదని, ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చార్మీ, ముమైత్.. తదితరులు చెప్పారు. అసలు ఏంటీ ధీమా? ఎందుకంత కాన్ఫిడెన్స్..? ఇదే ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న.

 

          సాధారణంగా తప్పు చేస్తే కాస్తూ కూస్తో కంగారు పడడం కామన్. పైగా విచారణకు వెళ్లే ముందు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఆ ఇష్యూపై ఎక్కడా స్పందించేందుకు ముందుకు రారు. కానీ ఈ ఇష్యూలో మాత్రం ప్రతి ఒక్కరూ చాలా ఓపెన్ గా ఉంటున్నారు. లోపల ఏంజరుగుతోందనేది పక్కనపెడితే బయట మాత్రం వారందరూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. తమకేం కాదని, తామేం తప్పుచేయలేదనే ఫీలింగ్ లోనే ఉన్నారు.

 

          వీళ్ల భరోసాకు కారణం ఒకటి వాళ్లు తప్పుచేయకుండా అయినా ఉండాలి.. రెండు తప్పును ధైర్యంగా ఎదుర్కోగలమన్న ధీమా అయినా ఉండాలి. మరి ఈ రెండింటిలో ఏది నిజమో.. ఏది అబద్దమో వేచి చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: