రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో సంబంధం లేదు -విశాఖ బాధితురాలి క్లారిటీ
విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డిపై నమోదైన కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. యువతి ఫిర్యాదు మేరకు ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో 15 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారని కూడా యువతి ఆరోపించినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బాధితురాలు స్పష్టతనిచ్చింది.
ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితురాలు మాట్లాడుతూ.. అసలు వివాదం తనకు, రాహుల్ రెడ్డికి మధ్య జరిగిన వ్యక్తిగత వ్యవహారమని తెలిపింది. రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాము ఇద్దరం చట్టపరమైన ప్రక్రియలో ఉన్నామని, ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశామని వెల్లడించింది.
రాహుల్ రెడ్డి బంధువుగా రాహుల్ సిప్లిగంజ్ పేరు బయటకు రావడంతో కొంతమంది తనను బెదిరింపులకు, వేధింపులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. తనపై ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని వీడియోలు చేయించారని, వాటినే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పేర్కొంది. తనను హనీట్రాప్ కేసులో ఇరికిస్తామని, తనకు వ్యతిరేకంగా తప్పుడు ఆధారాలు సృష్టిస్తామని బెదిరించారని తెలిపింది.
అంతేకాకుండా, తనపై తప్పుడు ఫిర్యాదులు సృష్టించి మానసికంగా ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించింది. ప్రభుత్వం, పోలీసుల పేర్లను ఉపయోగించుకుని కొంతమంది తన కెరీర్, జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఇద్దరి మధ్య జరగని విషయాలను కూడా జరిగినట్లుగా చిత్రీకరించారని, వీడియోలు, ఆడియోలను మార్పులు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.
తాను చేయని విషయాలను తనపై రుద్ది తనను చెడ్డ వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో రాహుల్ రెడ్డి, తన మధ్య ఉన్న వివాదాన్ని పరస్పర అంగీకారంతో పరిష్కరించుకున్నామని తెలిపింది. కోర్టులో దాఖలు చేసిన కేసును కూడా వెనక్కి తీసుకున్నామని వెల్లడించింది.
తాజా వ్యాఖ్యలతో రాహుల్ సిప్లిగంజ్‌కు, రాహుల్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత వివాదానికి నేరుగా సంబంధం లేదని బాధితురాలు స్పష్టం చేసినట్లయింది.