పెద్ది టైటిల్ వెనుక అసలు కథ ఇదే.. ఈ విషయాలు మీకు తెలుసా?

Reddy P Rajasekhar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "పెద్ది" సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుండటంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఈ తరుణంలో సినిమా టైటిల్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, కథా నేపథ్యాన్ని దర్శకుడు బుచ్చిబాబు సన స్వయంగా వెల్లడించి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు.

ఈ సినిమా టైటిల్ విషయమై బుచ్చిబాబు మాట్లాడుతూ, ఉమ్మడి గోదావరి జిల్లాలో తనకు తెలిసిన "పెద్దిరాజు" అనే ఒక విలక్షణమైన వ్యక్తి జీవితం నుండి ఈ కథకు స్ఫూర్తి లభించిందని చెప్పారు. ఆయన ఒకవైపు తాపీ పని చేసుకుంటూనే, మరోవైపు ఎవరు డబ్బులు ఇస్తే వారి తరఫున క్రికెట్, బాస్కెట్ బాల్ మ్యాచ్‌లు ఆడేవారని తెలిపారు. ఆ నిజ జీవిత వ్యక్తి క్యారెక్టరైజేషన్ నచ్చి, దానికి కాస్త ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నట్లు ఆయన వివరించారు. అందుకే ఈ చిత్రానికి "పెద్ది" అనే టైటిల్ పక్కాగా సరిపోతుందని ఫిక్స్ అయినట్లు పేర్కొన్నారు.

అయితే గత కొంతకాలంగా ఈ సినిమా ప్రముఖ యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై బుచ్చిబాబు స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఒక కల్పిత కథ అని తేల్చిచెప్పారు. అలాగే రామ్ చరణ్ ఇదివరకే గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి చరణ్‌ను సరికొత్తగా చూపించడం కోసం, గోదావరి కాకుండా విజయనగరం జిల్లా నేపథ్యంలో ఈ సినిమాను షూట్ చేసినట్లు బుచ్చిబాబు వెల్లడించారు. ఈ సరికొత్త కాంబినేషన్ మరియు విభిన్నమైన కథాంశం వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందో తెలియాలంటే మరికొద్ది గంటల్లో రాబోయే ట్రైలర్ చూసేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: