“మాట ఇచ్చా.. కానీ”..ఆర్బీ చౌదరి మరణంపై రజినీ ఎమోషనల్ కామెంట్స్!
ప్రముఖ సినీ నిర్మాత, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి గారి హఠాన్మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందలాది విజయవంతమైన చిత్రాలను నిర్మించి, ఎందరో స్టార్లను అందించిన ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు. ఈ క్రమంలో చౌదరి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన రజినీకాంత్, వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.ఆర్బీ చౌదరి గారిని చివరిసారిగా చూసిన రజినీకాంత్, వారి మధ్య జరిగిన ఆఖరి సంభాషణను మీడియా ముందు రివీల్ చేశారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది.
రజినీకాంత్ మాట్లాడుతూ.. "నేను ‘జైలర్ 2’ షూటింగ్ పనుల్లో ఉన్నప్పుడు చౌదరి గారు నాకు కాల్ చేశారు. ఆయన తన బ్యానర్ గురించి మాట్లాడుతూ.. 'రజినీ గారు, ఇప్పటివరకు మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో 99 సినిమాలు పూర్తి చేశాం. కానీ ఇంతవరకు మీతో సినిమా చేసే అదృష్టం నాకు దక్కలేదు. మా బ్యానర్‌లో రాబోయే ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా మీతోనే చేయాలని నా కోరిక' అని అడిగారు" అని తెలిపారు.
దీనికి తలైవర్ కూడా ఎంతో సంతోషంగా స్పందించి, "తప్పకుండా చౌదరి గారు.. మనందరం కలిసి ఆ వందవ సినిమా చేద్దాం" అని మాట ఇచ్చారట. కానీ, ఆ బెంచ్ మార్క్ సినిమా పట్టాలెక్కకముందే ఆర్బీ చౌదరి కాలం చేయడం రజినీని బాగా కలిచివేసింది. "ఆయన కోరిక తీర్చే లోపే ఇలా జరుగుతుందని ఊహించలేదు" అంటూ రజినీ ఎమోషనల్ అయ్యారు.ఆర్బీ చౌదరి మరణవార్త తెలియగానే కేవలం తమిళ పరిశ్రమ మాత్రమే కాకుండా, తెలుగు సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు కూడా సూపర్ గుడ్ ఫిలిమ్స్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రజినీకాంత్ పరామర్శకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆర్బీ చౌదరి ఒక నిర్మాతగానే కాకుండా, ఎందరో కొత్త దర్శకులను, నటులను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి.99 సినిమాలు పూర్తి చేసి, 100వ సినిమాను రజినీకాంత్ వంటి దిగ్గజంతో చేయాలని ఆయన పెట్టుకున్న లక్ష్యం ఆయన సినీ ప్రేమకు నిదర్శనం. ఆయన వారసులుగా జీవా, జితన్ రమేష్ వంటి వారు నటులుగా రాణిస్తున్నప్పటికీ, తండ్రిగా ఆయన సాధించిన విజయాలు అజరామరం.జైలర్ 2 తర్వాత తలైవర్ ఏ సినిమా చేసినా, అది చౌదరి గారి జ్ఞాపకార్థం ఉండేలా ప్లాన్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.