గద్దర్ అవార్డ్స్‌లో మెగాస్టార్‌కు ఘన గౌరవం.. బాస్ ఈజ్ ఆల్వేస్ బ్యాక్ విత్ అవార్డ్స్!

Amruth kumar
తెలుగు సినిమా అంటే ఒకప్పుడు కేవలం మద్రాసు స్టూడియోలకే పరిమితం. కానీ, ఆ సినిమాను ఊరూవాడా పాకించి, ‘మాస్’ అనే పదానికి అసలైన అర్థం నేర్పించిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఈ ఛత్రపతికి ఇప్పుడు మరో అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స్-2025లో భాగంగా చిరంజీవికి‘ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు’నుప్రకటించారు.భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేయనుండటంతో మెగా అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి.



1970ల చివరలో ఒక సాదాసీదా కుర్రాడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివశంకర వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవిగా మారిన ప్రయాణం ఒక అద్భుతం.ఈరోజు టాలీవుడ్‌లో ఉన్న 24 క్రాఫ్ట్స్‌లో ఏ ఒక్కరిని కదిలించినా.. "మేము చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చాం" అని గర్వంగా చెబుతారు. యంగ్ హీరోల నుంచి సీనియర్ల వరకు అందరికీ ఆయనే ఒక పాఠ్యపుస్తకం. ఖైదీతో మొదలైన ఆయన ప్రభంజనం.. జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, ఠాగూర్ వంటి సినిమాలతో తెలుగు సినిమా హిస్టరీని తిరగరాసింది. ఆయన వేసే స్టెప్పులు, కొట్టే డైలాగులు, చూపించే గ్రేస్ దశాబ్దాలు దాటినా ఇప్పటికీ కుర్ర హీరోలకు సాధ్యం కావడం లేదు.



తెలంగాణ ప్రభుత్వం ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో ఈ అవార్డులను ప్రవేశపెట్టింది. కళాకారులను, సమాజం కోసం కృషి చేసే వ్యక్తులను గౌరవించడమే ఈ అవార్డుల లక్ష్యం.తెలుగు సినిమా లెజెండ్ సీనియర్ ఎన్టీఆర్ పేరు మీద ఇచ్చే ఈ నేషనల్ అవార్డును చిరంజీవికి ప్రకటించడం విశేషం. ఇద్దరు ధృవతారల పేర్లు ఒకే చోట చేరడం తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ ఘట్టం. కేవలం కెమెరా ముందే కాదు, నిజ జీవితంలోనూ చిరంజీవి హీరోనే. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి రక్తాన్ని, కంటి చూపును అందించి ‘ప్రాణదాత’గా నిలిచారు. పద్మవిభూషణ్ వంటి గౌరవాలు అందుకున్న ఆయన ఖాతాలో ఇప్పుడు ఈ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చేరడం సముచితం.



మెగాస్టార్‌కు ఈ గౌరవం దక్కడం మెగా ఫ్యామిలీలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ చిరుకు శుభాకాంక్షలు చెబుతూ రచ్చ చేస్తున్నారు.మొత్తానికి ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు మెగాస్టార్ చిరంజీవికి ద‌క్క‌డం తెలుగు సినిమా గర్వించదగ్గ ఘట్టంగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: