ప్రభాస్ స్పిరిట్ సినిమాలో గోపీచంద్.. వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత?

Reddy P Rajasekhar

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమా ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి. 'యానిమల్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగా దర్శకత్వం వహిస్తుండటం, ప్రభాస్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో  ఒక కీలక పాత్రలో మ్యాచో స్టార్ గోపీచంద్ నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వర్షం సినిమా కాలం నుండి వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. ఈ స్నేహం కారణంగానే స్పిరిట్ సినిమాలో గోపీచంద్ ఉండబోతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఈ మధ్య కాలంలో హీరోగా గోపీచంద్‌కు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. ఈ క్రమంలో ఆయన మళ్లీ విలన్ పాత్రలు చేస్తారనే చర్చ కూడా మొదలైంది. కెరీర్ ప్రారంభంలో 'నిజం', 'వర్షం' వంటి సినిమాల్లో విలన్‌గా గోపీచంద్ చూపించిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. మళ్లీ అలాంటి పవర్‌ఫుల్ పాత్ర పడితే గోపీచంద్ ఇమేజ్ మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ప్రాధాన్యతనిచ్చాయి. తనకు ఇప్పుడు సాధారణ విలన్ పాత్రలు చేయాలని లేదని, ఒకవేళ చేయాల్సి వస్తే ఆ పాత్రకు చాలా డెప్త్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం విలన్ అనిపించుకోవడం కోసం కాకుండా, కథను మలుపు తిప్పే బలమైన పాత్రలు రావాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే, ఒకవేళ తన స్నేహితుడు ప్రభాస్ సినిమాలో గనుక విలన్ పాత్ర ఆఫర్ వస్తే, తప్పకుండా చేస్తానని ఆయన గతంలోనే వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత బలంగా, వైల్డ్‌గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఒకవేళ సందీప్ మార్క్ విలనిజానికి గోపీచంద్ నటన తోడైతే, అది వెండితెరపై ఒక సంచలనమే అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రచారం కేవలం ఊహాగానాలకే పరిమితమైనప్పటికీ, స్పిరిట్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వస్తే తప్ప అసలు నిజం బయటపడదు. ఒకవేళ వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ప్రభాస్, గోపీచంద్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: