మోహన్‌లాల్ ‘వృషభ’ సినిమాకు గుండు సున్నా ..!
గత ఏడాది మోహన్ లాల్ వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్నారు. ఎల్-2: ఎంపురాన్ కు మిశ్రమ స్పందన వచ్చినా ఈ సినిమా మాలీవుడ్‌లో రూ. 270 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
తుడరమ్: ఈ చిత్రం కూడా తన సత్తా చాటుతూ దాదాపు రూ. 240 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
హృదయ పూర్వం: ఒక క్లాస్ మూవీగా వచ్చిన ఇది కూడా రూ. 100 కోట్ల మార్కును అందుకొని మోహన్ లాల్ బ్రాండ్ ఇమేజ్‌ను మరోసారి నిరూపించింది.
‘వృషభ’ దారుణ వైఫల్యం :
ఇలాంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హీరో నుంచి వచ్చిన పాన్ - ఇండియా సినిమా ‘వృషభ’ మాత్రం చతికిలపడింది. క్రిస్మస్ వీకెండ్ లాంటి క్రేజీ సీజన్‌లో విడుదలైనప్పటికీ, ఈ సినిమా కనీసం రూ. 2 కోట్ల మార్కును కూడా అందుకోలేకపోయింది. మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ సినిమాకు ఇది అత్యంత దారుణమైన వసూళ్ల రికార్డు. సరైన పబ్లిసిటీ లేకపోవడం, ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కంటెంట్ లేకపోవడంతో సొంత అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు. విడుదల ఖర్చులు మరియు పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి రాకపోవడంతో నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
బిజినెస్ సంక్షోభం :
సాధారణంగా మోహన్ లాల్ సినిమా అంటే థియేట్రికల్ రిలీజ్‌కు ముందే డిజిటల్, శాటిలైట్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. కానీ ‘వృషభ’ విషయంలో అలా జరగలేదు. ఎటువంటి డిజిటల్, శాటిలైట్ ఒప్పందాలు జరగకుండానే సినిమాను థియేటర్లలోకి విడుదల చేశారు. ఇప్పుడు సినిమా ఫలితం దారుణంగా ఉండటంతో, భవిష్యత్తులో ఈ హక్కులను తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూపాయి కూడా మిగల్చకపోవడంతో, పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయినట్లే కనిపిస్తోంది. ఒకవైపు వందల కోట్ల వసూళ్లు, మరోవైపు కనీస ఓపెనింగ్స్ లేని పరాజయం.. మోహన్ లాల్ కెరీర్‌లో ఇదొక విచిత్రమైన పరిస్థితి. 'వృషభ' వైఫల్యం పాన్-ఇండియా సినిమాల విషయంలో కేవలం నటుడి చరిష్మా మాత్రమే సరిపోదని, బలమైన కంటెంట్ మరియు మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అవసరమని మరోసారి నిరూపించింది.