విజయ్ జననాయగన్ .. అయినా బాలయ్యే కనిపిస్తున్నాడుగా..?
సినిమా రంగంలో ప్రస్తుతం రీమేక్ అనే పదం వినబడితే చాలు, ప్రేక్షకులు ముఖం చాటేస్తున్నారు. ఓటీటీలు, ఇంటర్నెట్ పుణ్యమా అని ఇతర భాషా చిత్రాలను ప్రేక్షకులు రిలీజ్ అయిన వెంటనే చూసేస్తున్నారు. దీంతో రీమేక్ సినిమాల్లోని 'సర్ప్రైజ్ ఎలిమెంట్' దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలోనే తమ సినిమా రీమేక్ అని చెప్పుకోవడానికి మేకర్స్ భయపడుతున్నారు. తాజాగా దళపతి విజయ్ తన చివరి సినిమాగా ప్రకటించిన ‘జననాయగన్’ చుట్టూ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఈ సినిమా ‘భగవంత్ కేసరి’ రీమేక్ అన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
‘రీమేక్’ వివాదం - దర్శకుడి ఆన్సర్ :
నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ ఆధారంగానే ‘జననాయగన్’ రూపుదిద్దుకుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే, దర్శకుడు హెచ్. వినోద్ మాత్రం దీనిని రీమేక్ అని స్పష్టంగా ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ప్రి-రిలీజ్ ఈవెంట్లో దీనిపై స్పందిస్తూ, "ఇది రీమేకా కాదా అన్నది నేను చెప్పలేను కానీ, ఇది పక్కా ‘విజయ్ సినిమా’ అని మాత్రం హామీ ఇవ్వగలను" అని బదులిచ్చారు. కథలో చాలా మార్పులు చేశామని, విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మలిచామని ఆయన చెప్పుకొచ్చారు.
అనిల్ రావిపూడి కామెంట్ :
మరోవైపు ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ విషయంపై ఆసక్తికరంగా స్పందించారు. "జననాయగన్ టీమ్ అది విజయ్ సినిమా అని చెబుతున్నారు. ఆ చిత్రంలో నేను భాగమా కాదా అన్నది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది" అని సున్నితంగా దాటవేశారు. అయితే, ఆయన మాటల్లో ఏదో ఒక లింక్ ఉందనే అనుమానం అభిమానుల్లో బలపడింది. ‘జననాయగన్’ ప్రోమోలు చూస్తే ఇది ‘భగవంత్ కేసరి’కి కాపీ లేదా రీమేక్ అని ఇట్టే అర్థమవుతోంది.
విజయ్ లుక్ బాలయ్యను, మామిత బైజు పాత్ర శ్రీలీలను, పూజా హెగ్డే పాత్ర కాజల్ అగర్వాల్‌ను గుర్తుకు తెస్తున్నాయి. సినిమాలో విడుదలైన ‘దళపతి కచ్చేరి’ పాట వింటుంటే, ‘భగవంత్ కేసరి’లోని పాపులర్ ‘ఇచ్చి పాడ్’ సాంగ్ ఆత్మ అందులో కనిపిస్తోంది. ట్రైలర్ లోని కొన్ని యాక్షన్ బ్లాక్స్ మరియు బాబాయ్-అమ్మాయి సెంటిమెంట్ సీన్లు ఒరిజినల్ నుంచి యథాతథంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
చిన్నపాటి మార్పులు చేసినంత మాత్రాన ఒక సినిమా కొత్త కథ అయిపోదు. ‘జననాయగన్’ చిత్ర బృందం ఎంతగా దాచాలని ప్రయత్నించినా, ఇది ‘భగవంత్ కేసరి’కి రీమేక్ కాని రీమేక్ లాగే కనిపిస్తోంది. విజయ్ రాజకీయ ప్రస్థానానికి ముందు వస్తున్న చివరి సినిమా కావడంతో, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.