ఎన్టీఆర్‌ను వదిలేసి బన్నీ దగ్గరకు ఆ స్టార్ డైరెక్టర్..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అగ్ర హీరోలతో 'మ్యూజికల్ ఛైర్' ఆట ఆడుతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్న ఒకే ఒక్క మైథలాజికల్ కథ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రేజీ కాంబినేషన్ల వెనుక జరుగుతున్న అసలు కథ చాలా ఉంది. త్రివిక్రమ్ గత కొంతకాలంగా ఒక భారీ బడ్జెట్ సోషియో-మైథలాజికల్ కథపై కసరత్తు చేస్తున్నారు. తొలుత ఈ కథను అల్లు అర్జున్ కోసం సిద్ధం చేశారు. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
ఎన్టీఆర్ ఎంట్రీ:
త్రివిక్రమ్ ఈ కథను ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా ఇప్పుడు ఈ కథ మళ్ళీ అల్లు అర్జున్ చెంతకు చేరింది. ప్రస్తుతం వెంకటేష్‌తో చేస్తున్న సినిమా పూర్తికాగానే, త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను బన్నీతో పట్టాలెక్కించే అవకాశం ఉందని టాక్. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
'పుష్ప 2' తర్వాత బన్నీ ఎవరితో చేస్తారనే విషయంలో బోయపాటి శ్రీను, లోకేష్ కనగరాజ్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సడన్ గా రేసులోకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. కాంబినేషన్ క్రేజ్: ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ జోడీ.. ఇప్పుడు 'మైథాలజీ' టచ్‌తో వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఎన్టీఆర్ ఎందుకు తప్పుకున్నారు ?
ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. గతంలో బన్నీ ఈ కథను వదులుకున్నప్పుడు కూడా సరైన కారణాలు బయటకు రాలేదు. బహుశా కథలో మార్పులు లేదా డేట్ల సర్దుబాటు సమస్య వల్ల ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.
ఏదేమైనా, త్రివిక్రమ్ మార్క్ మాటలు.. అల్లు అర్జున్ మార్క్ స్టైల్ కలిసి ఒక పురాణ గాథను తెరకెక్కించడం అంటే అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులకు నాంది పలకడమే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.