రవితేజ ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి ’ ... టాలీవుడ్లో ఆ బ్లాక్‌బస్టర్‌కు కాపీనా..?
మాస్ మహారాజా రవితేజకు ఇది నిజంగానే ఒక కీలకమైన సమయం. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం లేక సతమతమవుతున్న రవితేజ .. ఇప్పుడు తన రూటు మార్చి పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి బరిలో నిలవనుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవితేజ సినిమా అంటే భారీ యాక్షన్, అదిరిపోయే ఎలివేషన్లు ఆశిస్తారు. కానీ, ఈ టీజర్లో ఎక్కడా యాక్షన్ హంగామాకు తావు ఇవ్వకుండా, కేవలం ఫన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఒక భర్త ఎదుర్కొనే విచిత్రమైన సమస్య, దాని పరిష్కారం కోసం డాక్టర్‌ను ఆశ్రయించడం, ఆ క్రమంలో వచ్చే హాస్యం చుట్టూ టీజర్ సాగింది. పాత సూపర్ హిట్ సాంగ్ ‘కురిసింది వాన’ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ వింటేజ్ ఫీల్‌ను తీసుకొచ్చింది.
ఈ సినిమాలో కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. వెన్నెల కిషోర్, సత్య లాంటి అగ్ర కమెడియన్లు తోడవడంతో వినోదానికి లోటు ఉండదనిపిస్తోంది. ఇక గ్లామర్ పరంగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి తమ వంతు బాధ్యతను పంచుకున్నారు. అయితే, హీరో ఎదుర్కొంటున్న ఆ అసలు సమస్య ఏమిటనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. బహుశా ట్రైలర్లో దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
సంక్రాంతి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
టీజర్ చూస్తుంటే ఇది గతంలో వచ్చిన ‘పెళ్లాం ఊరెళితే’ వంటి సినిమాల తరహాలో హాయిగా నవ్వుకునేలా అనిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ - వేణు హీరోలు కాగా ఎస్వి. కృష్నారెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్టైల్లో ఉందని అంటున్నారు. సంక్రాంతి సీజన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. ఇలాంటి సమయంలో సరైన ఫన్ డ్రామా పడితే రవితేజకు హిట్ పక్కా. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతంలో మొదటి పాట ఇప్పటికే హిట్ అవ్వగా, సినిమా విడుదలకు ముందు మరిన్ని మంచి పాటలు వస్తే ఆ ఊపు మరింత పెరుగుతుంది. రవితేజ తన వరుస పరాజయాలకు బ్రేక్ వేసి తన మార్కెట్‌ను పదిలం చేసుకోవడానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కీలకంగా నిలుస్తుందేమో ? చూద్దాం.