అవతార్ 3 దూకుడు ... అయినా విజేత మాత్రం ' దురంధర్ ' ..!
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నెలకొన్న సుదీర్ఘ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ 'దురంధర్' సృష్టించిన ప్రభంజనం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఒక బాలీవుడ్ సినిమా విడుదలై మూడు వారాలవుతున్నా, మూడో వీకెండ్‌లోను అదే ఊపును ప్రదర్శించడం రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడూ చూడలేదు. విడుదలకు ముందు ఈ సినిమాపై ఎన్నో నెగటివ్ వైబ్రేషన్స్, కొందరు కావాలని చేసిన ప్రతికూల ప్రచారాలను తట్టుకుని, నేడు 'ఇండస్ట్రీ హిట్' దిశగా దూసుకుపోతోంది.
పుష్ప 2 రికార్డులే టార్గెట్ :
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 (హిందీ వెర్షన్) పేరిట ఉన్న 800 కోట్ల మార్కును 'దురంధర్' అతి త్వరలోనే అధిగమించేలా కనిపిస్తోంది. విశేషమేమిటంటే, పాన్ ఇండియా మంత్రం జపించకుండా, కేవలం సింగిల్ లాంగ్వేజ్ (హిందీ)లో విడుదలై ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం సామాన్యమైన విషయం కాదు. కేవలం ఉత్తరాదిలోనే కాదు, దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కూడా సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ కారణంగా థియేటర్ల సంఖ్య పెరుగుతోంది.
అవతార్ 3 ని వెనక్కి నెట్టి..
జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' వస్తే దురంధర్ జోరు తగ్గుతుందని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. అవతార్‌లోని విజువల్స్ అద్భుతంగా ఉన్నా, సాగదీసిన కథనం, మూడున్నర గంటల నిడివి ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి. దీంతో అవతార్ షోలను తగ్గించి మళ్ళీ దురంధర్ స్క్రీన్లను పెంచుతున్నారు. మరోవైపు 'అఖండ తాండవం 2' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడం కూడా ఈ సినిమాకు వరంగా మారింది. దర్శకుడు ఆదిత్య ధార్ పనితీరుపై పరిశ్రమలోని అగ్ర దర్శకులు, హీరోలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా, రామ్ గోపాల్ వర్మ లాంటి మేకర్స్ ఈ సినిమా మేకింగ్ స్టైల్‌ను కొనియాడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఏ సపోర్ట్ లేకుండా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో చేరడమే లక్ష్యంగా సాగుతోంది. బాలీవుడ్ సత్తాను మళ్ళీ ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రంగా 'దురంధర్' చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.