14 రీల్స్‌పై వీళ్ల కోసం ధ‌ర్మ‌మేనా ..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

అఖండ 2 వాయిదా పడటం బాలయ్య అభిమానులకు నిజంగా పెద్ద షాక్ ఇచ్చింది. ముఖ్యంగా చివరి నిమిషంలో రిలీజ్ డేట్ మారిపోవడం అందరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అగ్ర హీరో బాలకృష్ణ సినిమాకు ఇలా జరగడంతో అభిమానులే కాదు, పరిశ్రమ మొత్తం ఆశ్చర్యపోయింది. నిజంగా అంత జటిలమైన ఇష్యూ ముందే కనిపించలేదా ? థర్డ్ పార్టీ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ సినిమా విడుదలను నిలిపివేసే స్థాయిలో ఎందుకు దిగింది ? నిర్మాతలు ఇంత వరకు ఇబ్బందిని గుర్తించలేదా ? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది.
ఇలాంటి ప‌రిస్థితుల్లో నిర్మాతల బాధ కూడా చిన్నది కాదు. ఆర్థిక ఒత్తిడులు, విదేశీ వాణిజ్య ఒప్పందాలు, పంపిణీ వ్యవస్థలు అన్నీ కలిసొచ్చినప్పుడు తటస్థంగా వ్యవహరించడం అంత సులభం కాదు. అందుచేత అభిమానులు కూడా ఓపికగా కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకూ నిర్మాతల నుంచి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాకపోవడం అన్ని వర్గాల్లో ఆందోళన పెంచింది.


ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని గాసిప్పులు మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 12… డిసెంబర్ 25 తేదీలు అంటూ పలువురు తమ ఊహాగానాలతో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమస్య పరిష్కారమైందని, డిసెంబర్ 12న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం… ఈ వారం విడుదలవుతున్న సినిమాల యజమానుల్లో ఆందోళన మరింత పెంచింది. ఎందుకంటే అఖండ 2 వంటి భారీ సినిమా హఠాత్తుగా వచ్చేస్తే చిన్న సినిమాలకు మార్కెట్ పడిపోతుందన్న భయం ఆ నిర్మాత‌ల్లో ఉంది. అయినా నిర్మాతల వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడం వల్ల అనిశ్చితి అలాగే కొనసాగుతోంది.


ఈ నేపథ్యంలో ఈ వారం విడుదల కానున్న మోగ్లీ సినిమాలో నటిస్తున్న సరోజ్ ఒక కీలక ట్వీట్ చేసి వివాదాన్ని మరింత రగిలించాడు. “ 14 రీల్స్ ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదు. ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ చేస్తే, డిసెంబర్ 12 రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్న సినిమాలు తమ పబ్లిసిటీ ఖర్చులు తగ్గించుకునేవి. కానీ ఎలాంటి ప్రకటన లేకుండా అభిమానులు, పరిశ్రమ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందర్నీ గందరగోళంలో పడేశారు. ఇది మంచి పేరు తెచ్చుకునే విధానం కాదు ” అని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించాడు. ఆ ట్వీట్ కింద వచ్చిన కామెంట్స్‌లో 14 రీల్స్‌కు సపోర్ట్‌గా ఒక్క ట్వీట్ కూడా కనిపించకపోవడం గమనార్హం. కొందరు అయితే “ఇలాంటి నిర్మాతలకు బాలయ్య సినిమా ఇవ్వడమే తప్పు” అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: