టాలీవుడ్ డేంజర్ జోన్‌లో పడిందా... ఇండస్ట్రీలో కలకలం..?
ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా కనబడుతోంది. పెద్ద చిత్రాలైనా, చిన్న చిత్రాలైనా రిలీజ్ ముందు లేదా రిలీజ్ తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూలు తలెత్తుతున్నాయి. ఇది పరిశ్రమలోని ఆర్థిక అంశాలపై రకరకాల సందేహాలకు తావిచ్చేలా ఉంది. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ అఖండ 2 ’ విడుదలకు వచ్చిన సమస్యలు, నిర్మాతల పై కోర్టు స్టే, అప్పుల వివాదాలు , ఇవన్నీ ఒక పెద్ద రెడ్ సిగ్నల్‌ను ఇండస్ట్రీకి వదిలాయి. 14 రీల్స్ ఫ్లస్ బ్యానర్ కు పాత బకాయిలు ఉండడంతో సినిమా విడుదల ఆగిపోవడం, పంపిణీదారులు, అభిమానులు తీవ్రంగా నిరాశ చెందడం ఇవన్నీ సినిమా వ్యవస్థలో బలహీనతలను బట్టబయలు చేశాయి.
అంతేకాదు, ప్రస్తుతం విడుదల కోసం సిద్ధంగా ఉన్న ఇంకా కొన్ని భారీ సినిమాలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటూ ఫిలింనగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. రెగ్యులర్ కాస్ట్ కంట్రోల్ లేకపోవడం, రెమ్యూనరేషన్ల పెరుగుదల, పంపిణీదారులపై అప్పుల భారం ఇవన్నీ టాలీవుడ్ భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముతున్నట్టు కనిపిస్తున్నాయి. అసలు హీరోల రెమ్యునరేషన్లు ఇష్టానుసారం పెరిగిపోతున్నాయి. ఒక్క హిట్టు కొట్టి పదేళ్లు అవుతున్న హీరో లు సైతం కోట్లలో రెమ్యునరేషన్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ నేపధ్యం లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టార్స్ అందరూ కలిసి ఒక స్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇంకొన్ని సినిమాలు ‘ అఖండ 2 ’ లాగే మధ్యలో ఆగిపోవచ్చు. అఖండ 2 రిలీజ్ ముగింట వాయిదా పడడం అనేది ఇండస్ట్రీకి ఇది హెచ్చరికే కాక, మార్పు కోసం వచ్చిన అవకాశం కూడా కావొచ్చు. ఇకపై ఇండస్ట్రీ ఎలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలో కూడా చెప్పకనే చెపుతోంది.