"ఏ ఆర్ రెహమన్ కోసం నా భార్య శ్రీదేవి అలాంటి పని చేసింది"..బోనీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్..!

Thota Jaya Madhuri
బాలీవుడ్ లెజెండరీ నటి శ్రీదేవి పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆమె అందం, అభినయం, మరియు అద్భుతమైన వ్యక్తిత్వం. ఎన్నో దశాబ్దాల పాటు సినీ రంగంలో తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఈ నటి, వెండితెరపై మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా అపారమైన మంచితనం కలిగిన వ్యక్తిగా పేరుపొందింది. శ్రీదేవి తన జీవితంలో సంపాదించిన ఆస్తిలో చాలా భాగాన్ని మహిళల అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసిందని ఆమెను దగ్గరగా తెలిసినవారు చెబుతుంటారు. శ్రీదేవి నటించిన చివరి చిత్రం “మామ్” . ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. 2017లో విడుదలైన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ అయ్యింది. మలయాళ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా విడుదల చేశారు. విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించి, 30 కోట్ల బడ్జెట్‌పై సుమారు 175 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి, పెద్ద రికార్డు సృష్టించింది.



ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోనీ కపూర్ ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. “మామ్ సినిమా కోసం శ్రీదేవి చూపిన అంకితభావం అమోఘం. ఈ పాత్ర కోసం ఆమె ఎంత కష్టపడిందో చెప్పలేను. సినిమాకి నాలుగు భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పింది. మలయాళం డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. కానీ ఆమె పర్ఫెక్ట్‌గా నేర్చుకుని డబ్బింగ్ చేసింది. ఈ స్థాయి కట్టుదిట్టమైన నైపుణ్యం చాలా అరుదైన నటీమణులకు మాత్రమే ఉంటుంది” అని బోనీ చెప్పారు.అంతేకాక, సినిమాలో సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురైందని బోనీ చెప్పారు. “అప్పుడు శ్రీదేవి ముందుకు వచ్చి, తన పారితోషికంలో 70 లక్షలు తగ్గించుకుంటానని చెప్పింది. ఆ మొత్తం ఏ.ఆర్. రెహమాన్‌కు ఇచ్చి సినిమా కోసం ఆయనను ఒప్పించాం. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం మాకు ఎంతో సహాయపడింది. లేకపోతే ఈ సినిమా కోసం రెహమాన్‌ను తీసుకోవడం కష్టమే అయ్యేది” అని బోనీ చెప్పారు.



షూటింగ్ సమయంలో శ్రీదేవి పూర్తిగా పాత్రలో మునిగిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. “మామ్ సినిమా షూటింగ్ రోజుల్లో శ్రీదేవి నాతో మాట్లాడేది చాలా తక్కువ. ఒకే గదిలో ఉంటే డిస్టర్బ్ అవుతానని చెప్పి, ప్రత్యేకంగా ఒక గదిలో ఉండేది. సినిమాపై ఆమె ఫోకస్ అంతా. ప్రతి సీన్‌ను పరిపూర్ణంగా చేయడానికి ఆమె పెట్టిన శ్రమ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ కష్టానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది” అని బోనీ కన్నీటి పర్యంతమయ్యారు. 2018లో దుబాయ్‌లోని ఒక హోటల్‌లో జరిగిన అనుకోని ప్రమాదంలో శ్రీదేవి మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె మరణం భారత సినీ పరిశ్రమకు ఒక పెద్ద నష్టం. బోనీ కపూర్ మాట్లాడుతూ, “శ్రీదేవి లేని లోటు సినీ పరిశ్రమలో ఎవరు తీర్చలేనిది. ఆమె స్థాయి, ఆమె అంకితభావం, ఆమె నటనకు ఎవరూ సరితూగలేరు. ఈ తరం నటీమణులకు ఆమె ఓ ప్రేరణ” అని భావోద్వేగంతో అన్నారు.



“మామ్” చిత్రం ద్వారా శ్రీదేవి తన చివరి రోజుల్లో కూడా తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఈ చిత్రం ఆమెకు జాతీయ స్థాయిలో ఘనత తెచ్చిపెట్టింది. కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా, తన వ్యక్తిత్వం, కృషి, అంకితభావం, మరియు సృజనాత్మకతతో సినీ పరిశ్రమలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకుంది శ్రీదేవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: