“మహేష్ బాబు = మాస్ + క్లాస్.. అశ్విన్ స్పెషల్ కామెంట్స్”..!
విహారి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తన ఆల్‌టైమ్ ఫేవరేట్ తెలుగు మూవీ మగధీర అని చెప్పినా… ఫేవరేట్ హీరో మాత్రం మహేష్ బాబు అని స్పష్టంగా చెప్పాడు. "రామ్‌చరణ్ ఫ్యాన్‌వేనా?" అని విహారి ముక్కుసూటిగా అడగ్గా, "కాదు… నా హీరో మహేష్ బాబు" అంటూ అశ్విన్ కటౌట్ పెట్టేశాడు. మహేష్ బాబు సినిమాలంటే అశ్విన్‌కి అంత ఇష్టం. సూపర్ స్టార్ చివరి సినిమా ‘గుంటూరు కారం’ గురించి కూడా ఆయన గొప్పగా మాట్లాడాడు. తన యూట్యూబ్ షో ది సదరన్ ఫ్లేవర్లో గుంటూరు కారం ఎంటర్‌టైనింగ్ మూవీ అని పొగిడేశాడు. ప్రత్యేకంగా ‘కుర్చీ మడత పెట్టి’ పాటలో మహేష్–శ్రీలీల డ్యాన్స్ మాస్ ఆడియన్స్‌ను మైమరపించిందని చెప్పాడు. మహేష్ ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్స్ అద్భుతమని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అసలు వేరే లెవెల్‌లో ఉంటుందని అశ్విన్ కితాబిచ్చాడు.
ఇక క్రికెట్ వైపు చూస్తే – గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన అశ్విన్, తాజాగా ఐపీఎల్‌కి కూడా గుడ్‌బై చెప్పేశాడు. ఇకపై ఫ్రాంచైజీ లీగ్స్‌కే ఫోకస్ చేస్తానని చెప్పాడు. ఈ ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడినా, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కానీ క్రికెట్ నుండి బయటకు వస్తున్నా, అశ్విన్‌కి అభిమానులు తగ్గడం లేదు. మరోవైపు మహేష్ బాబు మాత్రం తన కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌తో రెడీ అవుతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB 29 పాన్ వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కుతోంది. 120 దేశాల్లో రిలీజ్ చేయాలన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కెన్యాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చే ఏడాదికల్లా థియేటర్లలో సందడి చేయనుంది.అంటే ఒక వైపు క్రికెట్‌లో లెజెండరీ స్పిన్నర్ అశ్విన్… మరో వైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఇద్దరి కలయిక ఎక్కడైనా జరిగితే అభిమానులకు పండగే. అశ్విన్ మాటల్లో చెప్పాలంటే – “మహేష్ బాబు అంటే మాస్… క్లాస్… అన్నీ కలిసిన స్టార్!”