కూలీ సినిమా ప్లాప్‌కు రజనీకాంతే కారణమా.. లోకేష్ తప్పులేదా...!
తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యంత క్రేజ్ కలిగిన సూపర్‌స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ “కూలీ” భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ‘జైలర్’ సక్సెస్ తరవాత రజనీతో కలిసి లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై ఆకాశాన్నంటిన అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిసొచ్చినా సినిమా మాత్రం ప్రేక్షకులను ఆశించినంతగా ఎంటర్టైన్ చేయలేకపోయింది. ఈ సినిమాలో రజనీకాంత్ పవర్ఫుల్, మాస్ రోల్లో కనిపించారు. ఆయన ఎంట్రీ సీన్స్, పంచ్ డైలాగ్స్, స్టైల్ మాత్రం అభిమానులను ఉత్సాహపరిచాయి. కానీ కథ, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండడంతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో సాధారణంగా కనిపించే ట్విస్టులు, మలుపులు ఈ సారి సరిగ్గా కనెక్ట్ కావడం లేదని ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన చర్చ ప్రకారం ఈ సినిమా ట్రాక్ తప్పడానికి రజనీకాంత్ ప్రధాన కారణమట. మొదట్లో లోకేష్ కనగరాజ్, రజనీ చుట్టూ తిరిగే థ్రిల్లర్ స్టైల్ కథను రాసాడట. ఆ స్టోరీలో రజనీకాంత్ పాత్ర గ్రే షేడ్స్‌తో, చాలా ఇంటెన్స్‌గా ఉండేదని సమాచారం. కానీ రజనీ ఆ ప్రపోజల్‌ను తిరస్కరించి, “జైలర్” తరహా మాస్ ఎంటర్టైన్మెంట్ స్టైల్ కథ కావాలని చెప్పారట. దాంతో లోకేష్ తన అసలు కథను వదిలి, కొత్తగా స్క్రిప్ట్ రాసి రజనీకి తగ్గట్టుగా “కూలీ”ని తీర్చిదిద్దాడు. ఈ మార్పుతో పలువరు స్టార్స్‌ను తీసుకు రావాల్సి వచ్చింది.
ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ వంటి నటులు ఉన్నా కూడా వారి పాత్రలు సినిమాలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఎక్కువసేపు రజనీ హైలైట్ అయ్యే సీన్స్ ఉన్నా, కథలో కొత్తదనం లేకపోవడం వలన సినిమా సెకండాఫ్ తేలిపోయింది. ఫైనల్‌గా “కూలీ” సినిమాకు రజనీకాంత్ స్టైల్, మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కథలో కొత్తదనం లేకపోవడం వలన అంచనాలను అందుకోలేకపోయింది. ఓపెనింగ్‌తో బాగా మొదలైన సినిమా, మిక్స్డ్ టాక్ కారణంగా స్లోగా మారిపోతోందని చెప్పాలి. రజనీకాంత్ నిర్ణయం సినిమాకు బూస్ట్ కాకుండా.. మైనస్‌గా మారిందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.