నట సింహం నందమూరి బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా కథ రోటీన్ గా ఉన్నా థమన్ ఇచ్చిన బీజీఎం, బాలయ్య పవర్ ఫుల్ డైలాగులతో పాటూ యాక్షన్ సినిమాకు హైలెట్ గా నిలిచాయని రివ్యూలు వస్తున్నాయి. సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఓ రేంజ్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక సంక్రాంతికి మాస్ మసాలా రుచి చూపించిన డాకు మహారాజ్ సినిమాకు బాబి దర్శకత్వం వహించారు. సాధారణంగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే డాకు మహరాజ్ బాబీ దర్శకత్వంలో వచ్చి హిట్ టాక్ రావడంతో బాలయ్యకు మరో బోయపాటి దొరికాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే డాకు మహారాజ్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది అని చాలా మందికి తెలియదు. డాకుమాన్ సింగ్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. డాకు 1890 సంవత్సరంలో ఆగ్రాకు 500 కిలోమీటర్ల దూరంలోని ఖేరా రాథేడ్ గ్రామంలో జన్మించాడు. ఛంబల్ ప్రాంతంలో పెరగ్గా చిన్న నాటి నుండే డాకుకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఊరిలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి ఆదుకునే స్వభావం ఆయనది. అలా చివరికి వారికి నాయకుడిగా ఎదుగుతాడు. 17 మందితో కలిసి దోపిడీ ముఠా ఏర్పాటు చేసి 16 ఏళ్లలో 1112 దోపిడీలు వందల హత్యలు చేస్తాడు. నాలుగు రాష్ట్రాల పోలీసులు వెతికినా కళ్లు కప్పి తప్పించుకుంటాడు. పోలీసుల రికార్డుల్లో క్రూరుడుగా పేరున్న డాకు పేద ప్రజలకు ఎంతో సాయం చేశాడు. దోచుకున్న ధనమంతా ప్రజాసేవకు వినియోగించి గ్రామాలకు గ్రామాలనే బాగు చేశాడు. దీంతో ప్రజల దృష్టిలో దేవుడు అయ్యారు. ఇదీ డాకు మహరాజ్ అసలు కథ.