అనిల్ రావిపూడిని చూసి మిగతా డైరెక్టర్లు నేర్చుకోవలేమో.. ఎందుకంటే?
అందుకే నిర్మాతలు ఆయన కోసం క్యూ కడుతున్నారు. తెలుగులో మరే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తీయనంత వేగంగా అనిల్ సినిమాలు తీస్తారు. తక్కువ సమయంలో పర్ఫెక్ట్ మూవీని అందించగల అనిల్, స్క్రిప్ట్ దశలోనే ఎడిటింగ్, సినిమాకు కావాల్సిన సన్నివేశాలను మాత్రమే చిత్రీకరిస్తారు. ఈ వ్యూహాల వల్ల వేస్టేజ్ తక్కువగా ఉండటమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకుముందు 'ఎఫ్2', 'ఎఫ్3' సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మరి వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుందా అనేది వేచి చూడాలి.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశామని అనిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో చిన్న సినిమాలు తీయడానికి కూడా కనీసం ఒక సంవత్సరం పడుతోంది. అలాంటిది ఒక పెద్ద హీరోతో, ఇంత పెద్ద సినిమాను కేవలం రెండు నెలల్లో పూర్తి చేయడం నిజంగా విశేషం. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో పక్కా ప్రణాళికతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి చెప్పిన ప్రకారం, ఎడిటింగ్‌లో కేవలం 5-6 నిమిషాల ఫుటేజీ మాత్రమే కట్ చేశారంట. అంటే వేస్టేజ్ ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
"సంక్రాంతికి వస్తున్నాం సినిమాను 72 రోజుల్లో పూర్తి చేశాం. 'ఎఫ్2' సినిమాను 74 రోజుల్లో పూర్తి చేశాం. వర్కింగ్ డేస్ తగ్గితే అందరికీ రిస్క్ తగ్గుతుంది. ఎక్కువ క్వాలిటీ కాకుండా, తక్కువ క్వాలిటీ కాకుండా సినిమాకు ఏ క్వాలిటీ అయితే బాగుంటుందో అదే క్వాలిటీతో తీశాం. 100% అవుట్‌పుట్ నాకు సంతృప్తినిచ్చింది. ఆడియన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. విజువల్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. థియేటర్‌లో కూర్చొని చూస్తే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సెకండాఫ్ కోసం ఒక సెట్ కూడా నిర్మించాం, కానీ బడ్జెట్ ఎక్కువ కేటాయించలేదు. పేపర్‌లో ఎన్ని నిమిషాల సీన్ రాసుకున్నామో అంతే షూట్ చేశాం, ఎక్కువ పొడిగించలేదు. ఈ సినిమా మొత్తం రన్ టైమ్ 2 గంటల 21 నిమిషాలు. ఫైనల్ అవుట్‌పుట్ 2 గంటల 26 నిమిషాలు వస్తే ఐదు నిమిషాలు కత్తిరించాం" అని అనిల్ చెప్పారు. ఈ మాటలు విన్న నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు అనిల్ రావిపూడిని ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.