ముసుగేసుకుని.. చిరంజీవి సినిమాలు చూసేవారు: పవన్
ఇక అదే సమయంలో హీరోవైపు కూడా తప్పు ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. దానికి ఉదాహరణగా.. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావించారు పవన్. ఒకప్పుడు చిరంజీవి కూడా ఇలా రిలీజ్ రోజు సినిమాలకు వెళ్లేవారని, అయితే ముఖానికి ముసుగు కట్టుకుని మరీ వెళ్లేవారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, చుట్టూ చాలా కెమెరాలు గమనిస్తున్నాయని అన్నారు. తానూ ఒక్కోసారి కళ్ళు మాత్రమే కనపడేలా వెళ్లినా గుర్తు పట్టేసే వారని అన్నారు. ఇపుడు హీరోలు అలా వెల్దామన్నా అది అంత తేలికైన విషయం కాదని అభిప్రాయపడ్డారు.
ఇక ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించిందని.. చెప్పుకొచ్చారు. సినిమా విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని ప్రశంసించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగింది. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారని, టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అల్లు అర్జున్ విషయంలో ముందు, వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు... కానీ చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేం! అని మాట్లాడారు.