రాఘవ లారెన్స్ పేరు చెప్పి అలాంటి మోసాలు.. ఇలా చేయడం నిజంగా దారుణం!

Reddy P Rajasekhar
సౌత్ ఇండియాలో రాఘవ లారెన్స్ కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. అయితే సాయం చేస్తానంటూ రాఘవ లారెన్స్ పేరుతో చేస్తున్న మోసాల గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి రాఘవ లారెన్స్ పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడటం హాట్ టాపిక్ అవుతోంది.
 
నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా లారెన్స్ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే లారెన్స్ కు సమాచారం ఇచ్చి సహాయం చేస్తానంటూ ఒక అజ్ఞాత వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నారు. లారెన్స్ సహాయకుడినని చెప్పి ఆ వ్యక్తి చెన్నైలోని ఎగ్మూర్ కు చెందిన వీర రాఘవన్ ను మోసం చేశారు. లారెన్స్ త్వరలో ఒక స్వచ్చంద సంస్థను మొదలుపెట్టనున్నాడని ఆ సంస్థ ద్వారా మీ పిల్లల చదువు ఖర్చు మొత్తం వారే భరిస్తారని చెప్పుకొచ్చారు.
 
ఆ అజ్ఞాతవ్యక్తి 8457 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని కోరాడని ఇందుకు సంబంధించిన నగదును ఫోన్ పే ద్వారా తాను చెల్లించానని ఆయన చెప్పుకొచ్చారు. అతని మాటలు నమ్మి ఆ తర్వాత 2875 రూపాయలు, 50 వేల రూపాయలు చెల్లించానని ఆయన తెలిపారు. నగదు తిరిగివ్వాలని డిమాండ్ చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిందని వీర రాఘవన్ వెల్లడించారు.
 
ఈ మోసం చేసిన వ్యక్తి పేరు దినేశ్ కుమార్ అని అతని స్వస్థలం వేలూర్ అని సమాచారం అందుతోంది. దినేశ్ కుమార్ ను పోలీసులు పుళల్ జైలుకు తరలించారని తెలుస్తోంది. ఈ మోసాల గురించి రాఘవ లారెన్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రాఘవ లారెన్స్ పేరుతో ఇలాంటి మోసాలు జరగడంపై ఆయన అభిమానులు ఫైర్ అవుతుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పేర్లు చెప్పి ఈ తరహా మోసాలు చేయడం సాధారణం అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: