టాలీవుడ్ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. జక్కన్న ఆయన కెరియర్‌లో తీసిన సినిమాలన్నీ హిట్టే. ముఖ్యంగా రాజమౌళి తీసిన ఈగ సినిమా ఒక రికార్డే అని చెప్పాలి. ఇండియాలో సినిమాలు పెద్దవిజయం సాధించాలంటే స్టార్ హీరోలు అవసరం లేదని నిరూపించారు. కేవలం ఈగతో సినిమా మొత్తం నడిపించాడు. ఒక విజువల్ వండర్‌ను చూపించాడు.ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ… ఈజీ ఈజీ ఈజీ గా తేరి జాన్ లేగ…” అంటూ ఈగ వెండితెరపై చిందులు వేస్తోంటే ఆబాలగోపాలం కేరింతలు కొట్టారు. గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయడంలో తెలుగునాట తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి సీజీలో ఈగను క్రియేట్ చేసి ఈజీగా జనం మదిని దోచేశారు. సరిగా పదేళ్ళ క్రితం జూలై 6న ‘ఈగ’ ప్రేక్షకుల ముందు నిలచింది. వారి మదిని గెలిచింది. బాక్సాఫీస్ నూ షేక్ చేసింది.
2012లో విడుదలైన టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిల్చిన ఈగ మూవీకథ ‘బెడ్ టైమ్ స్టోరీ’లా ఉంటుంది కాబట్టి ఇందులోని అభూత కల్పనలను ‘ఫెయిరీ టెయిల్’లాగే తీసుకోవాలి కానీ, భూతద్దం వేసి తప్పులు వెదుకరాదని ఆరంభంలోనే చెప్పేశారు దర్శకుడు.కధకు అనుగుణంగా హీరో నానిను విలన్ చంపేయడంతో ఈగగా జన్మించి విలన్ను ముప్పుతిప్పలు పెట్టి చివరికి అతని అంతం చూస్తాడు. హీరోగా నాని చేసింది అరగంట క్యారెక్టర్ అయినా సినిమా చివరిదాకా హీరో ఉన్నట్లే డైరెక్టర్ జక్కన్న చూపించడంతో హీరోలోనే లోటు మనకు ఎక్కడా కనబడదు.నాని కేరిర్లో తనకు ఒక మైల్ స్టోన్ మూవీగా ఈగ నిలుస్తుందని ఆయన అనేక సార్లు చెప్పారు.అయితే ఈ మూవీస్టోరీ అనేది బైబిల్ లోని ‘డేవిడ్ అండ్ గోలియత్’ కథ స్ఫూర్తితో రూపొందించామని రాజమౌళి చెప్పారు. చిన్నవాడయిన డేవిడ్, అతి భయంకరుడైన గోలియత్ ను వడిసెలతో ఎలా కొట్టి పడేశాడు అన్న అంశంలాగే ఇందులోనూ ఈగలా జన్మించిన హీరో తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి, ప్రతినాయకుడిని అంతం చేయడం కనిపిస్తుంది.
ఈ చిత్రంలో సుదీప్, నాని, సమంత, ఆదిత్య, తాగుబోతు రమేశ్, ఛత్రపతి శేఖర్, నోయెల్, శ్రీనివాస రెడ్డి, దేవదర్శిని, రాజీవ్ కనకాల, ధన్ రాజ్, హంసానందిని నటించారు. ఈ చిత్రానికి కీరవాణి బాణీలు కట్టగా, “ఈగ ఈగ ఈగ…” పాటను రామజోగయ్య రాశారు; “కొంచెం కొంచెం…” అంటూ సాగే పాటను అనంత శ్రీరామ్, “లవ లవ…” అనే పాటను చైతన్య ప్రసాద్, “నేనే నానినే…” అనే పాటను కీరవాణి పలికించారు. ఈ సినిమా తమిళంలో ‘నాన్ ఈ’ అనే పేరుతో అలాగే మలయాళంలో 'ఈచ’ పేరుతో అనువాదం చేసి భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొని ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సంపాదించింది. దీంతో పాటు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ లోనూ నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ‘మకుట వీఎఫ్ఎక్స్’ సంస్థ స్పెషల్ ఎఫెక్ట్స్ రూపొందించింది. టోరంటో ఫిలిమ్ ఫెస్టివల్ లోనూ, షాంఘై చిత్రోత్సవంలోనూ ‘ఈగ’ ప్రదర్శితమై, అంతర్జాతీయ సినిమా అభిమానులనూ ఆకట్టుకుంది.