దేవర క్లోజింగ్ కలెక్షన్స్.. ప్చ్.. ప్రభాస్ ఫ్లాప్ మూవీని కూడా దాటలేకపోయాయిగా?
ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా 'దేవర' గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల జోరు ఇంకా కొనసాగుతూ ఉందని తెలుస్తోంది. అదే విధంగా దసరా కానుకగా విడుదలైన కొన్ని కొత్త సినిమాలను కూడా దేవర చిత్రం డామినేట్ చేసి సంచలనం సృష్టించిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ రన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు దాదాపుగా క్లోసింగ్ కి వచ్చేసినట్టుగా ట్రేడ్ పండితులు జోష్యం చెబుతున్నారు.
దసరా శెలవులు సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలలో మంచి వసూళ్లు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఫలితంగా కోటి రూపాయిల షేర్ వచ్చినట్టు భోగట్టా. కేవలం నైజాం ప్రాంతం నుండే 38 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు నిన్న ఒక్క రోజే వచ్చాయంటే ఇక అర్ధం చేసుకోవచ్చు. ఇక దసరా శెలవులు దాదాపుగా మిగిసిపోవడంతో రోజువారీ షేర్ వసూళ్లు 50 లక్షల రూపాయిల కంటే తక్కువగా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఫుల్ రన్ కి మరో 2 నుండి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది.
అది కాస్త పక్కన పెడితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ విషయంలో కొన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఈ సినిమాకి కేవలం 385 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని అనగా, మరికొంతమంది అయితే 420 కోట్ల రూపాయిలు వచ్చినట్టు చెప్తున్నారు. ఇక నిర్మాతలు అయితే ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి విదితమే. ఇదంతా పక్కన పెడితే దేవర చిత్రం ప్రభాస్ నటించిన ఫ్లాప్ చిత్రాలు ‘ఆదిపురుష్’, ‘సాహూ’ వసూళ్లను కూడా దాటలేకపోయిందని సోషల్ మీడియా లో ప్రభాస్ అభిమానులు ట్రోల్స్ చేయడం కొసమెరుపు. ‘సాహూ’ చిత్రానికి 432 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ‘ఆదిపురుష్’ చిత్రానికి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అందరికీ తెలిసిందే.