రివ్యూ: దేవ‌ర 1

RAMAKRISHNA S.S.
న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌, సైఫ్ ఆలీఖాన్‌, బాబీడియోల్‌, ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీకాంత్ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
సంగీతం: అనిరుద్థ్‌ రవిచంద్రన్‌
సమర్పణ: నందమూరి కల్యాణ్‌రామ్‌
నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్‌, హరీష్‌ కొసరాజు
దర్శకత్వం: కొరటాల శివ
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబ‌ర్‌, 2024

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ అంటే ఒక క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయింది. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా దేవర. సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో పాటు త్రిబుల్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావటం.. అటు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవితో ఆచార్య అంటే డిజాస్టర్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయన కూడా ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో పని చేశారు. పాటలు - ట్రైలర్ అంచనాలను అందుకో లేకపోయినా దేవరపై భారీ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన దేవర ప్రేక్షకులను ఎంతవరకు ? ఆకట్టుకుంది.. ఎన్టీఆర్ కొరటాల ఖాతాలో హిట్టు పడిందా లేదా అన్నది ఇండియా హెరాల్డ్ సమీక్షలో చూద్దాం.

క‌థ :
ఎర్ర సముద్రం తీరంలో గల రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. ఈ నాలుగూళ్ల జ‌నాలు తమ జీవనం సాగించడం కోసం మురుగ (మురళీ శర్మ) కోసం సముద్రం మార్గంలో అక్రమంగా రవాణా జరిగే సరుకును కోస్ట్‌గార్డ్‌లకు చిక్కకుండా స్మ‌గ్లింగ్ చేస్తూ వ‌చ్చే డ‌బ్బుల‌తో బ‌త‌కు వెళ్ల‌దీస్తూ ఉంటారు. ఈ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివశించే దేవర భయానికే భయం పుట్టించేంత వీరుడు. సముద్ర మార్గం గుండా వచ్చిన ఆయుధాల వల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడి ప్రాణం పోయిందని తెలిసి ఇకపై మురగ దగ్గర పని చేయకూడదనుకుంటాడు. అయితే దీనిని మ‌రో గ్రామానికి చెందిన నాయ‌కుడు అయిన భైర (సైఫ్‌ అలీఖాన్‌) అంగీకరించడు. దేవరను తప్పించి తను సంద్రాన్ని శాసించాలనుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో శ్రీకాంత్ చెల్లి పెల్లిలో దేవ‌ర‌ను చంపే ప్లాన్ చేస్తాడు భైర‌. ఆ త‌ర్వాత దేవ‌ర ఎవ్వ‌రికి క‌నిపించ‌కుండా పోతాడు. ఇలా 12 యేళ్లు గ‌డిచిపోతాయి. అజ్ఞాతంలో ఉన్న తండ్రి దేవ‌ర కోసం కొడుకు వ‌ర ( ఎన్టీఆర్ ) ఏం చేశాడు.. వ‌ర కూడా భైరతో క‌లిసి త‌న తండ్రి దేవ‌ర‌ను ఎందుకు చంపాల‌నుకుంటాడు ?  దేవ‌ర ఏమ‌య్యాడు ?  దేవ‌ర గురించి కుటుంబానికి తెలిసిన నిజం ఏంటి ?  వ‌ర కూడా ఎందుకు చ‌నిపోవాల‌నుకుంటాడు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ దేవ‌ర సినిమా.
విశ్లేష‌ణ :
సినిమా ఫస్టాఫ్‌ అంతా ఎర్ర సముద్రం కథ, దేవర, భైరవ పాత్రలు, పోరాటాలు, జాతర, ఆయుధ పూజ నేపథ్యంలో సాగుతాయి. దేవ‌ర తాము చేస్తోన్న ప‌ని త‌ప్ప‌ని తెలుసుకుంటాడు. అప్ప‌టి వ‌ర‌కు క‌థ చాలా స్లోగా ముందుకు వెళుతుంది. అయినా ప్రేక్ష‌కుడు ఓపిక చేసుకుని చూసేలానే ఉంటుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ నుంచి కథ ట్రాక్‌ తప్పిన ఫీల్‌ కలుగుతుంది. దేవ‌ర‌ను చంపేందుకు బైరా వేసే ఎత్తులు... ఆ త‌ర్వాత సంద్రానికి కాపలాగా నేనుంటాను అని చెప్పి దేవర అజ్ఞాతంలోకి వెళ్లడం నుంచి కథ కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ కూడా సినిమాపై హైప్ తీసుకురాలేదు. ఇక సెకెండాఫ్‌లో వర, తంగం పాత్రలు పరిచయం అవుతాయి. వీళ్ల ల‌వ్ ట్రాక్ కూడా సోసోనే. దేవర అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి ప్రతి సన్నివేశం ఊహకు అందేలా ఉంటుంది. భయంగా ఉండే వ‌రే త‌న తండ్రి స్థానంలో ఉండి క‌థ అంతా న‌డిపిస్తున్నాడ‌న్న‌ది సినిమా చూసే ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది.

కొరటాల శివ బలం రచన. తను తెరకెక్కించిన హిట్‌ చిత్రాలు చూస్తే.. కథలో బలం కనిపిస్తుంది. క‌థ‌నం కాస్త అటూ ఇటూగా ఉన్నా మంచి సోష‌ల్ కాజ్ తీసుకుని... దాని చుట్టూ మంచి సీన్లు అల్లుకుని క‌థ‌నం న‌డిపిస్తూ ఉంటాడు. క‌థ‌నం స్లో ఉంటుంది... ఎలివేష‌న్లు ఉండ‌వ‌న్న కంప్లైంట్లు కొర‌టాల సినిమాల్లో ముందు నుంచే ఉన్నాయి. ఈ సినిమాలో కొత్త‌ద‌నం మిస్ చేశాడు.. క‌థ‌నం విష‌యంలో ప‌ట్టు కోల్పోవ‌డంతో పాటు డైలాగులు కూడా పేల‌లేదు. ఇంట‌ర్వెల్ నుంచి ప్ర‌తి సీన్ ముందే ఊహించేలా ఉంటుంది. సైఫ్ ఆలీఖాన్ లాంటి బ‌ల‌మైన విల‌న్‌ను పెట్టుకున్నా ఆ పాత్ర‌ను అంతే ప‌వ‌ర్ ఫుల్‌గా తీర్చిదిద్ద‌లేక‌పోయాడు.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
ఎన్టీఆర్ ద్విపాత్రిభిన‌యం చేసిన ఐదో సినిమా ఇది. దేవరగా తండ్రి పాత్రలో, 'వర’గా యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఆకట్టుకున్నారు. దేవర పాత్రలో తారక్‌ బాడీ లాంగ్వేజ్‌, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. న‌ట‌న ప‌రంగా ఎన్టీఆర్‌కు వంక పెట్ట‌లేం. ఇక దివంగ‌త అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌కు తెలుగులో తొలి సినిమా. ఆమె పాత్ర‌కు భారీ ఎలివేష‌న్ ఇచ్చి తుస్సుమ‌నిపించారు. మూడు సీన్లు. ఓ పాట మిన‌హా ఆమెకు ప్రాధాన్యం లేదు. మొత్తం మీద 15 నిమిషాల లోపు మాత్ర‌మే క‌నిపించింది. గ్లామ‌ర్‌తో మెప్పించింది. విలన్‌గా భైర పాత్రలో కనిపించారు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌. సినిమాకు కీలకమైన పాత్రే కానీ ఆయనే చేసేంత స్కోప్ ఉన్న పాత్ర కాదు. కేవ‌లం నార్త్ మార్కెట్ కోస‌మే ఈ పాత్ర‌ల‌కు వీరిని తీసుకున్న‌ట్టు క్లీయ‌ర్‌గా తెలుస్తోంది. మిగిలిన న‌ట‌ల్లో శ్రీకాంత్‌, మురళీశర్మ, అజయ్‌, శ్రుతి  తదతరులు కీలక పాత్రల్లో పరిధి మేరకు నటించారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే...
టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌,  ప్రొడక్షన్‌ డిజైన్‌, క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అండర్‌ వాటర్ సీన్ల‌కు భారీగానే ఖ‌ర్చు పెట్టారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ రిచ్ విజువ‌ల్స్ ప‌నిత‌నంతో క‌న‌ప‌డింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ మంచి ఆల్బ‌మ్ క‌న్నా నేప‌థ్య సంగీతంతో ఆక‌ట్టుకున్నాడు. ఇక ఆర్ట్ వ‌ర్క్ జ‌స్ట్ ఓకే. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ బ‌లం ర‌చ‌న‌.. ఈ సినిమాలో కొర‌టాల మ్యాజిక్ మిస్ అయ్యింది. క‌థ స్పాన్ ఎక్కువ అయినా.. క‌థ‌నం తేలిపోయింది.. డైలాగులు తుస్సుమ‌నిపించాయి. త్రిబుల్ ఆర్ లాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను చేరుకునే స్థాయిలో సినిమా లేదు. సినిమాపై అంచ‌నాలు లేకుండా వెళితే ఓ సారి చూడొచ్చు.. అది కూడా కేవ‌లం ఎన్టీఆర్ కోస‌మే అన్న‌ట్టు ఉంటుంది.
ప్ల‌స్ పాయింట్స్ ( + ) :
- ఫ‌స్టాఫ్‌
- అనిరుధ్ బీజీఎం
- ఎన్టీఆర్ యాక్టింగ్
- జాన్వీను తెలుగు తెర‌మీద ఫ‌స్ట్ టైం చూడ‌డం
- నిర్మాణ విలువ‌లు
- వాట‌ర్ సీన్ యాక్ష‌న్ సీక్వెన్స్‌
మైన‌స్ పాయింట్స్ ( - ) :
- కొర‌టాల శివ ర‌చ‌న‌
- ద‌ర్శ‌క‌త్వం
- సెకండాఫ్‌
- క్లైమాక్స్‌

ఫైన‌ల్‌గా...
ఆరేళ్ల త‌ర్వాత ఎన్టీఆర్ సోలోగా వెండితెర మీద క‌నిపించిన దేవ‌ర భారీ అంచ‌నాలు అందుకోలేదు... ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌... జాన్వీ అందాలు.. అనిరుధ్ మ్యూజిక్ కోసం ఓ సారి వెళ్లి చూసి రావ‌చ్చు... అంచ‌నాలతో వెళితే నిరాశ త‌ప్ప‌దు

దేవ‌ర రేటింగ్ : 2.5 / 5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: