ట్రెండింగ్లో 'అశ్వద్దామా'! ఇప్పటికీ బ్రతికేవున్నారు! అసలు ఎవరీ అశ్వద్దామా?

Purushottham Vinay
ఈ భూమి మీద సత్య యుగం నుంచి ఉన్న సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు. మన మహాభారత చరిత్రలో ఆయన పాత్ర అద్భుతం. వీరుడు, శూరుడు, పుట్టుకతో వరాన్ని పొందిన మగ ధీరుడు. ఈయన ఎవరో కాదు.. కౌరవ, పాండవుల గురువు ద్రోణాచార్యుడు, కృపి సంతానం ఈయన.అయితే పుట్టే సమయంలో ఈయన అందరిలాగా ఏడవకుండా గుర్రంలా సకిలించినందుకు ఈ పేరు పెట్టారని కథ ఉంది. అశ్వత్థామ సాక్ష్యాత్తు ఆ పరమ శివుడి వరప్రసాదం. పుట్టుకతోనే ఆయన నుదుటిపై ఓ మణితో జన్మించాడు. అది అతనికి మృత్యువు సహా అన్ని రకాల బాధల నుంచి కూడా రక్షణనిస్తుంది. అలా ఈ ద్రోణపుత్రుడు చిరంజీవి అయ్యాడు. అశ్వత్థామ తండ్రి శిక్షణలో కౌరవ, పాండవులతో పాటే విద్యని నేర్చుకున్నాడు. అర్జునుడికి సాటి వచ్చే విలుకాడిగా ఈయన రాటుదేలాడు.ఇంకా అర్జునుడితో పాటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్నీ సాధించాడు. అయితే ఈయనది దుడుకు స్వభావం. అస్త్ర ప్రయోగం అత్యవసరమైతే తప్ప చేయకూడదన్న తండ్రి మాటలను అశ్వత్థామ అస్సలు చెవికెక్కించుకోలేదు. ఇక దుర్యోధనుడితో స్నేహం చేసిన అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన ఉండి పోరాటం చేశాడు.ఆ మహా యుద్ధంలో తండ్రి మరణం తట్టుకోలేక పాండవుల మీదికి శక్తిమంతమైన నారాయణాస్ర్తాన్ని ప్రయోగిస్తాడు. అయితే అది ఆయుధాలు ఉన్నవారినే తప్ప నిరాయుధులను ఏమాత్రం దండించదు. శ్రీకృష్ణుడి సలహాతో పాండవ వీరులంతా కూడా తమ ఆయుధాలను వదిలేస్తారు. 


ఇక అలా పాండవులు యుద్ధంలో ఓటమిని తప్పించుకుంటారు. ఇక మహా భారతం యుద్ధం పూర్తయిన తర్వాత కూడా అశ్వత్థామ తన మిత్రుడు దుర్యోధనుడి కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఓ రాత్రివేళ పాండవుల శిబిరం పైన దాడిచేస్తాడు. అయితే పొరపాటున పాండవ పుత్రులైన ఉపపాండవులను సంహరిస్తాడు.అది తెలుసుకున్న పాండవులు ఆగ్రహోదగ్రులు అవుతారు. జరిగినదానికి అశ్వత్థామ కారకుడని వారు తెలుసుకుంటారు. ఆయన్ని వేదవ్యాసుడి ఆశ్రమంలో పట్టుకుంటారు. అప్పుడు అశ్వత్థామ, పాండవులకు మళ్లీ యుద్ధం మొదలవుతుంది. దీంతో అశ్వత్థామ అర్జునుడి కోడలు గర్భిణిగా ఉన్న ఉత్తర పైకి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు.అయితే నష్టం జరగకముందే శ్రీ కృష్ణుడు మధ్యలో జోక్యం చేసుకుంటాడు. ఉత్తరను ఆయన కాపాడతాడు. చిరంజీవి అయిన అశ్వత్థామను కుష్ఠువ్యాధితో రోజులు వెళ్లదీయమని కృష్ణుడు ఎన్నడూ లేని కోపంతో శపిస్తాడు. గర్భంలో ఉన్న శిశువును చంపే ప్రయత్నం చేసినందుకు కృష్ణుడి శాపభారాన్ని మోస్తూ అశ్వత్థామ కుష్ఠువ్యాధితో యుగ యుగాల నుంచి బాధపడుతూ ఇప్పటికీ జీవించి ఉన్నాడని మన చరిత్ర చెబుతుంది. ఇలాంటి అశ్వద్దామ పాత్రని కల్కి 2898 ఏడిలో అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నాడు. చూడాలి ఈ సినిమాలో అయన పాత్ర ఎలా ఉంటుందో. ప్రస్తుతం అశ్వద్దామా గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: