టిల్లు స్క్వేర్ ఓటిటి: అంత తొందరెందుకు టిల్లు?

Purushottham Vinay
డీజే టిల్లు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ అవ్వడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరో సిద్దు జొన్నలగడ్డ దానికి సీక్వెల్‌ ను చేశాడు. టిల్లు స్క్వేర్ అంటూ వచ్చిన ఈ సీక్వెల్ కి కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ వచ్చింది.ఫస్ట్ పార్ట్‌ తో పోల్చితే సెకండ్ పార్ట్‌ కి దాదాపు రెట్టింపు వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అసలు నాలుగు వారాలు కూడా పూర్తి అవ్వకుండానే టిల్లు స్క్వేర్ సినిమా ఏకంగా రూ.125 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు, హిట్‌ టాక్ రావడంతో ఇంకా సినిమాకి మంచి వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ వారు టిల్లు స్క్వేర్‌ సినిమా స్ట్రీమింగ్‌ కు ఇప్పుడు రెడీ అయ్యారు. ఏప్రిల్‌ 26 వ తేదీన ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడం ఇంకా హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.


అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.సాధారణంగా హిట్‌ సినిమాలు కనీసం 50 రోజులు థియేటర్ లలో ఆడిన తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు వస్తున్నాయి. కానీ టిల్లు గాడి డీజే సౌండ్‌ మాత్రం మరీ ఇంత త్వరగా ఓటీటీ లో మళ్లీ వినిపిస్తుందని ఎవరూ అనుకోలేదు. నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అయిన టిల్లు స్క్వేర్‌ కచ్చితంగా మళ్లీ ఓటిటిలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.సిద్దు జొన్నలగడ్డకు జోడీగా ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ లో రూపొందిన టిల్లు స్క్వేర్‌ సినిమా ఈ ఏడాది హిట్ చిత్రాల లిస్టులో నిలిచింది. హనుమాన్, సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాల తరువాత ఎక్కువ వసూళ్లు నమోదు చేసిన సినిమాగా టిల్లు స్క్వేర్ సినిమా నిలిచింది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్‌ తర్వాత మరింతగా ఈ సినిమా గురించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. టిల్లు 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ అవ్వడంతో మూడో పార్ట్‌ ను కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: