పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకి అదే సమస్య వస్తుందా...??
పవన్ ఇటీవల వారాహి యాత్రలో ఆంధ్రా పరిపాలనపై విరుచుకుపడ్డారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు. వ్యక్తుల ఆధార్, మొబైల్ నంబర్, కుటుంబ సమాచారం, పిల్లల సమాచారం వంటి రహస్య సమాచారాన్ని సేకరించే హక్కు వాలంటీర్లకు లేదు. కానీ సీఎం జగన్ మాత్రం వాలంటీర్లను పెట్టుకుని రాష్ట్ర ప్రజలందరి సమాచారాన్ని సేకరించి విదేశీ సంస్థలకు అమ్మేశారని ఆరోపించారు.'ఆంధ్రాలో వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు. గ్రామంలో ఒంటరి మహిళల సమాచారాన్ని సేకరించి పంచుకోవడం వల్లే ఈ మానవ అక్రమ రవాణా జరిగింది. ఈ మానవ అక్రమ రవాణాకు గ్రామ వాలంటీర్లను వాడుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరికైనా గ్రామ వాలంటీర్ల ద్వారా ఇబ్బంది కలిగితే మా వద్దకు రండి.. వారికి మేం సాయం చేస్తాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా జరడానికి కారణం గ్రామ వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న సమాచారమే. రహస్యంగా సేకరిస్తున్న సమాచారం అసాంఘిక వర్గాలకు చేరుతోందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి.' అని పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్ ఈ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్లు నిరసన వ్యక్తం చేయడమే కాదు. ఇప్పుడు పవన్ సినిమా విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా జులై 28న విడుదలవుతుండగా, ఆ సినిమాను ఆంధ్రాలో విడుదల చేయకుండా అడ్డుకునేందుకు, ఒకవేళ విడుదలైన థియేటర్లకు వెళ్లకుండా ఉండేందుకు చర్చలు చేస్తున్నారట.పవన్ సినిమాకు ఆంధ్రాలో సమస్యలు రావడం ఇదే మొదటిసారి కాదు. సీఎం జగన్పై పవన్ విమర్శలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయన సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 'వకీల్ సాబ్' సినిమాకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో సమస్యలు వచ్చాయి. ఇప్పుడు బ్రో సినిమా విడుదలకు ముందు పవన్ చేసిన కామెంట్స్ తో మరోసారి సినిమాపై ప్రభావం చూపించనుందని పలువురి అభిప్రాయం.