ఎన్టీఆర్ గారు విజయశాంతి కి క్షమాపణలు చెప్పడానికి కారణం....!!

murali krishna
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదుని ఎన్టీఆర్ కు కేవలం నటన కోణంలోనే చూడకూడదు. నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో నిర్వహణ, రాజకీయం ఒకటేమిటి ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేయడమే కాకుండా వ్యక్తిత్వంలోనూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలవడం ఆయా వ్యక్తులు చెబితే తప్ప బయట ప్రపంచానికి తెలిసేది కాదు.
అలాంటి వాళ్ళలో 90 దశకంలో లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి కూడా ఉన్నారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఓ అరుదైన సంఘటన పరిచయం చేశారు.
విజయశాంతి బాలనటిగా 14 ఏళ్ళ వయసులో కెరీర్ అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అపురూప కలయికలో వచ్చిన సత్యం శివం సినిమాలో చెల్లెలిగా నటించే అదృష్టం దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం అటువైపు ఆవిడ స్టార్ హీరోయిన్ గా ఎదగడం జరిగిపోయాయి. 1985లో అయన చేతుల మీదుగా ప్రతిఘటనలో నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకోవడం ఓ అరుదైన జ్ఞాపకం. 1990లో ఎన్టీఆర్ తిరిగి మేకప్ వేసుకున్న చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర.
ఎన్టీఆర్ ఆ సినిమా డబ్బింగ్ స్టూడియోలో చెబుతున్న సమయంలో విజయశాంతి చిరంజీవి గ్యాంగ్ లీడర్ షూటింగ్ అదే ప్రాంగణంలో జరుగుతోంది. ఎన్టీఆర్ ని కలుద్దామని అక్కడికి వెళ్లిన ఆమెకు వెలుతురు సమస్య వల్ల ఆయన గుర్తుపట్టలేకపోవడంతో బాధ కలిగి వెనక్కు వచ్చేశారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ మరుసటి రోజే మదరాసులోని విజయశాంతి ఇంటికి నేరుగా వెళ్లిపోయారు. షూటింగ్ వల్ల అదే రోజు ఉదయం ఆవిడ హైదరాబాద్ వచ్చేశారు. దీంతో ఎన్టీఆర్ ఆ టైంలో ఇంట్లో ఉన్న శ్రీనివాస్ ప్రసాద్ ని కలిశారు.
పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పి బిడ్డను అడిగినట్టుగా క్షేమ సమాచారాలు తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్ లో వైజయంతి అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ కనుక్కుని స్వయంగా చేసి మరోసారి సారీ చెప్పారు. అక్కడి నుంచి పరస్పరం ఆత్మీయ అనుబంధం కొనసాగి బంధువుల్లా మెలిగేవారు. ఇది మీడియాలో వచ్చింది కాదు ఎన్టీఆర్ ఎక్కడ ప్రస్తావించింది లేదు. ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తిత్వం గురించి ఒక చిన్న ఉదాహరణ ఇవాళ విజయశాంతి చెబితేనే తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: