జోరు చూపేనా... మలుపు తిరిగేనా...?

murali krishna
ప్రస్తుతం అగ్ర కథానాయికల్లో కొందరు కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండగా.. మరికొందరు పరభాషల్లో సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నారు.కాలం కలిసొస్తే... రాత్రికి రాత్రే స్టార్‌ అయినవాళ్లున్నారు. ఇంకో రెండు హిట్లు పడ్డాయా.. అగ్ర నాయికల జాబితాలో చేరిన వాళ్లు తక్కువేం కాదు. ఇది హీరోయిన్‌ల కథండీ! కానీ.. వరుసగా రెండు వైఫల్యాలు పలకరించాయా? ఏకంగా వాళ్ల ఫేట్‌ మారిపోతోంది.  ఫ్లాప్‌ కథానాయిక అనే ముద్ర పడితే కెరీర్‌కు శుభం కార్డు పడినట్లే.  ప్రస్తుతం టాలీవుడ్‌లో పలువురు ఈ గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మరి వీళ్లలో పడిలేచిన కెరటంలా తిరిగి జోరు చూపేదెవరు? తమ కెరీర్‌ని మళ్లీ సానుకూలంగా మలచుకునేదెవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం అగ్ర కథానాయికల్లో కొందరు కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండగా.. మరికొందరు పరభాషల్లో సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకొద్దిమందికి అవకాశాలే కరవయ్యాయి. పరాజయాలతో ఢీలా పడటం.. మరోవైపు ప్రత్యామ్నాయాలుగా కొత్త భామలు రేసులోకి రావడంతో పలువురికి ప్రస్తుత కాలం భారంగా మారింది. ‘అందాల రాక్షసి’తో తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించింది లావణ్య త్రిపాఠి. ఆమె తన పదేళ్ల సినీ ప్రయాణంలో నాని, నాగార్జున, నాగచైతన్య, రామ్‌, వరుణ్‌ తేజ్‌, శర్వానంద్‌ తదితర కథానాయకులతో ఆడిపాడింది. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘అర్జున్‌ సురవరం’ వంటి చెప్పుకోదగ్గ విజయాల్నే ఖాతాలో వేసుకుంది. అయితే ‘హ్యాపీ బర్త్‌డే’ తర్వాత ఆమె మరో కొత్త అవకాశం అందుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘పులి మేక’ అనే వెబ్‌సిరీస్‌ మాత్రమే ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సిరీస్‌.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో విడుదల కానుంది. ‘నన్ను దోచుకుందువటే’ అంటూ తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది నభా నటేష్‌. కెరీర్‌ ఆరంభంలోనే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి భారీ కమర్షియల్‌ హిట్‌తోనూ సత్తా చాటింది. అయితే ఆ తర్వాత ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. చివరిగా ఏడాది క్రితం ‘మ్యాస్ట్రో’తో ఓటీటీ వేదికగా మెరిసిన ఈ కథానాయిక.. ఇంతవరకు మరో కొత్త కబురు వినిపించలేకపోయింది.కెరీర్‌ ఆరంభం నుంచీ ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది ప్రగ్యా జైస్వాల్‌. తొలినాళ్లలో వరుస ఫ్లాప్‌లు పలకరించినా.. ‘కంచె’ వంటి హిట్‌తో సత్తా చాటింది. ఆ తర్వాత ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘జయ జానకీ నాయకా’, ‘ఆచారి అమెరికా యాత్ర’ రూపాల్లో వరుస పరాజయాలు అందుకొంది. దీంతో 2018 తర్వాత మూడేళ్ల పాటు వెండితెరపై కనిపించలేదు. గతేడాది ‘అఖండ’ వంటి భారీ హిట్‌తో తెలుగు తెరపైకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన ఈ నాయిక.. ఆ వెంటనే ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’తో మరో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత మళ్లీ ఇంతవరకు ఆమె పేరు వినిపించలేదు. అందం.. ఆకట్టుకునే అభినయం.. వీటికి తోడు తొలి అడుగులోనే భారీ విజయం.. ఇవన్నీ చక్కగా కుదిరినా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనుకబడింది నటి ప్రియాంక జవాల్కర్‌. ‘టాక్సీవాలా’తో సినీప్రియులకు దగ్గరైన ఈ తెలుగందం.. ‘తిమ్మరుసు’, ‘ఎస్‌.ఆర్‌.కల్యాణ మండపం’ చిత్రాలతోనూ మెప్పించింది. అయితే ‘గమనం’ తర్వాత ఇంతవరకు మరో సినిమా ప్రకటించలేదు. ‘మెంటల్‌ మదిలో’ సినిమాతో కుర్రకారు మదిలో గంటలు మోగించిన అందం నివేదా పేతురాజ్‌. నటనా ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాలతో వరుస విజయాలు అందుకొంది. గతేడాది వచ్చిన ‘రెడ్‌’, ‘పాగల్‌’ చిత్రాల తర్వాత ఆమె తెలుగు నుంచి మరో కబురు వినిపించలేదు. చివరిగా ఇటీవల వచ్చిన ‘విరాటపర్వం’లో అతిథి పాత్రలో తళుక్కుమంది. ‘బ్లడీమేరీ’ సిరీస్‌తో ఓటీటీ వేదికగా పలకరించింది.

ఆఖరికి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎన్ని పరాజయాలు పలకరించినా ఈ భామలు మాత్రం పట్టు వదలడం లేదు. చూడాలి.. మంచి విజయంతో ఎందరు మళ్లీ రేసులోకి దూసుకొస్తారో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: