టాప్ హీరోల వద్దకు రాయబారం దేనికి సంకేతం ?
ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయారు అన్న లీకులు వస్తున్నాయి. ఒక వర్గం ఈ సమస్యలకు పరిష్కారం దొరికేవరకు సినిమా షూటింగ్ లు బంద్ చేయాలని అభిప్రాయ పడుతుంటే మరొక వర్గ నిర్మాతలు సినిమాల షూటింగ్ లు కొనసాగిస్తూనే టాప్ హీరోలతో చర్చలు జరిపి సినిమాల నిర్మాణ వ్యయం తగ్గించాలనే ఆలోచన చేస్తున్నారు.
ఈ ఆలోచనలలో భాగంగా కొందరు ప్రముఖ నిర్మాతలు ఒక టీమ్ గా ఏర్పడి త్వరలో టాప్ హీరోలను అదేవిధంగా టాప్ దర్శకులను కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరించి సినిమాల నిర్మాణ వ్యయం తగ్గించే విధంగా హీరోలను తమ పారితోషికాలను కనీసం 25శాతం తగ్గించుకోమని కోరనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ టీమ్ టాప్ దర్శకులను కూడ కలిసి వారి పారితోషికాలను తగ్గించుకోమని చెప్పడమే కాకుండా సినిమాల నిర్మాణ వ్యయం తగ్గే విధంగా ఖర్చులను అదుపులో పెట్టమని కోరనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు టాప్ హీరోల సినిమాలకు సంబంధించి పారితోషికాలను బాగా తగ్గించుకుని తాము నటించే సినిమాలలో వాటా తీసుకుని ఆసినిమాల లాభ నష్టాలలో టాప్ హీరోలను కూడ భాగస్వాములు అవ్వమని అడగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రాయబారానికి ఎంతవరకు మన టాప్ హీరోలు అంగీకరిస్తారు అన్న విషయమై చాల మందికి సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించి అప్పుడు దాసరి నారాయణరావు లాంటి ప్రముఖ వ్యక్తి ఇప్పుడు ఉండి ఉంటే ఇలాంటి రాయబారాలు ఫలితాన్ని ఇస్తాయి కానీ ఎవరికి వారు తప్పించుకుంటూ తెలివిగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ రాయబారాలు ఎంత వరకు సఫలం అవుతాయి అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి..