ప్రచార అస్త్రంగా మారిన సిరివెన్నెల పాట !

Seetha Sailaja

తెలుగుజాతి గర్వింప దగ్గ అతి కొద్దిమంది కవులలో సిరివెన్నెల ఒకరు. ఆయన చనిపోయి కొన్ని నెలలు గడిచినప్పటికీ ఆయన పాటను అదేవిధంగా ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పటికీ అందరు గుర్తుచేసుకుంటూనే ఉంటారు. సినిమా పాటల రచయితగా పేరుగాంచిన ఆయన మరణాన్ని సినిమాల ప్రచారం కోసం వాడుకుంటారని ఆయన కూడ ఊహించి ఉండరు.


సిరివెన్నెల చనిపోయిన తరువాత ఆయన వ్రాసిన చివరి పాట ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘దోస్తీ’ సాంగ్ అంటూ ప్రచారం జరిగింది. నాని ‘శ్యామ్ సింగరాయ్’ యూనిట్ మటుకు ఆయన వ్రాసిన చివరి పాట తమ సినిమాలోని ‘నెలరాజుల’ అంటూ ప్రచారం చేయడమే కాకుండా ఒక లిరికల్ వీడియోను కూడ విడుదల చేసి ఆమూవీ విడుదల సమయంలో తెగ హడావిడి చేసింది.


అయితే ఇప్పుడు దర్శకుడు మారుతి మరొక ఊహించని టర్న్ తీసుకున్నాడు. ‘గోపీచంద్ తో తాను తీస్తున్న ‘పక్కా కమర్షియల్’ మూవీ కోసం ‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు – జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ వ్రాసిన పాట సిరివెన్నెల చివరి పాట అంటూ మారుతి కొత్త ప్రచారానికి తెర తీస్తున్నాడు. అయితే ఈవిషయానికి మరొక ట్విస్ట్ ఇస్తూ యంగ్ హీరో కార్తికేయ స్నేహ శెట్టి లు హీరో హీరోయిన్స్ గా మొదలు పెట్టిన సినిమాకోసం సిరివెన్నెల చివరిసారి పాట వ్రాసారు అంటూ మరొక ప్రచారం జరుగుతోంది.


దీనితో సిరివెన్నెల చివరి పాట అంటూ ఈ వింత ప్రచారం ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. సిరివెన్నెల చనిపోయినా ఆయన పాటలతో ఆయన మన మధ్య జీవించి ఉంటాడు అన్నది సత్యం. ఈ విషయాలను కూడ పట్టించుకోకుండా సిరివెన్నెల చివరి పాట పై ఇలా రకరకాల ప్రచారాలకు తెరతీయడం ఎంతవరకు ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించినట్లు అవుతుంది అంటూ సిరివెన్నెల అభిమానులు మధన పడుతున్నారు. అందమైన తెలుగు భాషకు అందమైన అక్షర జ్యోతులను అందించిన సిరివెన్నెల పేరు కూడ వ్యాపారంగా మారిపోవడం దురదృష్టకరం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: