తాజాగా బన్నీ అన్న అల్లు వెంకటేష్ (బాబీ) ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర్జున్ ని పోల్చడం పై స్పందించారు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ నిర్మించిన 'గని' సినిమా ఈ శుక్రవారం నాడు (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవితో బన్నీచేంజ్ పోల్చడం సరికాదన్నారు."నేను ఎప్పటికీ చిరంజీవి గారితో అల్లు అర్జున్ ను పోల్చి చూడను. అలా చూడటం సరి కాదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని పెద్ద మెగాస్టార్ స్థాయికి చేరుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. కానీ బన్నీ మాత్రం అలా కాదు. తన వెనుక మా నాన్న ఇంకా తాతయ్య ఉన్నారు. అంతేకాదు మా ఫ్యామిలీలో ఎంతోమందికి చిరంజీవి గారే స్ఫూర్తి. బన్నీ కూడా ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాడు.
మనలో స్ఫూర్తి నింపిన వ్యక్తితో మనల్ని ఎప్పటికీ కూడా పోల్చుకోకూడదు'' అని అల్లు బాబీ అన్నారు.ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేందుకు ఇంకా విజయాలు అందుకునేందుకు బన్నీ ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాడని ఆయన సోదరుడు తెలిపారు. ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత బన్నీ ఎంతో పరిణతి చెందాడు. నిజానికి ఆ సినిమాపై బన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా ప్లాప్ అయింది. దీంతో సుమారు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. ఆ టైమ్ లో ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు? ఎటువంటి కథలు ఓకే చేయాలి?.. ఇలా బన్నీ తనని తాను పునఃపరిశీలన చేసుకున్నాడు.ఇక ఆ తర్వాత వచ్చిన చిత్రమే 'అల.. వైకుంఠపురములో సినిమా '' అని అల్లు బాబీ వివరించారు.