పవన్ కి కోపమొచ్చిందా..? చిరంజీవిపై మొదలైన ట్రోలింగ్..

Deekshitha Reddy
పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ టైమ్ లో ఎంత హంగామా జరిగిందో అందరికీ తెలుసు. సినిమా థియేటర్ల దగ్గర రెవెన్యూ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుళ్లు హడావిడి చేశారు. తీరా సినిమా విడుదలైంది. అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించి ఉండటం, బెనిఫిట్ షో లు లేకపోవడంతో నిర్మాతకు ఇబ్బంది కలిగిందని అంటున్నారు. అంతకు ముందు ఏపీ ప్రభుత్వంతో చిరంజీవి బృందం చర్చలు జరిపింది, త్వరలో శుభవార్త అన్నారు కానీ భీమ్లా టైమ్ కి ఆ శుభవార్త వినపడలేదు. తీరా ఇప్పుడు రాధేశ్యామ్ కోసం సినిమా టికెట్ రేట్లను సవరించిన జీవో విడుదల చేశారు. సరిగ్గా రాధేశ్యామ్ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు జీవో విడుదల కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు.
 

ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే.. ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి ఓ సందేశాన్ని విడుదల చేశారు. టికెట్ రేట్ల సవరింపు జీవో విడుదల చేసినందుకు సీఎం జగన్ కి, మంత్రి పేర్ని నానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చిన్న సినిమాని కూడా బతికిస్తున్నారంటూ ఆకాశానికెత్తేశారు. కానీ చిరంజీవి గతంలో భీమ్లా నాయక్ రిలీజ్ టైమ్ లో ఎలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయలేదు. భీమ్లా నాయక్ ని ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని టీడీపీ సపోర్ట్ చేసినా, చిరంజీవి సైలెంట్ గానే ఉన్నారు. దీంతో జనసైనికులు కాస్త నొచ్చుకున్నారు.


 


గతంలో నాగబాబు కూడా పరోక్షంగా భీమ్లా నాయక్ గురించి మాట్లాడలేని వారందరిపై సెటైర్లు వేశారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలెవరూ భీమ్లా నాయక్ కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోయారని అన్నారు నాగబాబు. ఆ పెద్దల్లో చిరంజీవి కూడా ఉన్నారు. అప్పట్లో చిరంజీవిని పరోక్షంగా విమర్శించినట్టే అని తేలిపోయింది. తీరా ఇప్పుడు ప్రభుత్వాన్ని పొగుడుతూ చిరంజీవి విడుదల చేసిన సందేశం పవన్ కి కూడా కోపం తెప్పించిందని అంటున్నారు. పవన్ పై కోపంతో అప్పట్లో జీవో ఇవ్వలేదనేది పవన్ ఆరోపణ. ఇప్పుడు జీవో ఇవ్వడం కూడా ఇండస్ట్రీపై ప్రేమతో కాదని, భీమ్లా నాయక్ విడుదలైపోయింది కాబట్టి జీవో ఇచ్చారని అంటున్నారు. ఈ దశలో చిరంజీవి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంపై ట్రోలింగ్ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: