ఎంతో మంది తిట్టారు..అయినా రిస్క్ చేసిన‌ న‌య‌న్‌..చివ‌ర‌కు సీన్ రివ‌ర్స్‌!

VUYYURU SUBHASH
`జయరాం` అనే మ‌ల‌యాళ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన న‌య‌న‌తార‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ దక్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను ఏర్ప‌ర్చుకుంది. హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే మ‌రోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారి లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందింది. అయితే న‌య‌న్ సినీ కెరీర్‌లో అతి గొప్ప అవ‌కాశం `శ్రీరామరాజ్యం` చిత్రంలో సీత పాత్ర‌.
హిందూ పురాణాల్లో ఉత్తర రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాపుగారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..యలమంచిలి సాయిబాబా నిర్మించారు. ఇందులో శ్రీ‌రాముడిగా నంద‌మూరి బాల‌కృష్ణ, సీతా దేవిగా న‌య‌న‌తార‌, లక్ష్మణుడుగా శ్రీ‌కాంత్ న‌టించారు. అయితే సీత పాత్ర‌కు న‌య‌న‌తార ఎంపిక అయింద‌న్న విష‌యం బ‌య‌ట‌కు రాగానే చాలా మంది తీవ్ర స్థాయిలు విమ‌ర్శ‌లు గుప్పించారు.
గ్లామర్ పాత్రలు చేసిన నయనతార సీతమ్మ పాత్రలో నటించడం ఏంటీ, ఇంత‌క‌న్నా ఘోరం మ‌రొక‌టి ఉంటుందా.. అంటూ ఎంద‌రో న‌య‌న్‌ను తిట్టిపోశారు. అంతేకాదు, న‌య‌న సీత‌గా న‌టిస్తే సినిమా ఫ్లాప్ అన్న టాక్ కూడా న‌డిచింది. అయితే ఎన్ని విమర్శలు, అవమానాలు ఎదురైనా న‌య‌న్ వాటిని అధిగమించి.. ఎంతో రిస్క్ తీసుకుని సీత పాత్ర‌లో న‌టించింది. ఇక విజ‌య‌వంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 17 నవంబరు 2011న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ముఖ్యంగా సీత పాత్రలో నయనతార అద్భుతంగా ఒదిగిపోయి న‌టించింది.
దీంతో సీన్ రివ‌ర్స్ అయింది. విమ‌ర్శించిన వారే న‌య‌న్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయి సీత పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసిందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. అంతేకాదు, ఈ సినిమా ద్వారా నయనతారకు ఉత్తమనటిగా నంది అవార్డు కూడా ద‌క్కింది. కాగా, ప్ర‌స్తుతం న‌య‌న‌తార తెలుగులో చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న `గాడ్ ఫాదర్` సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. అలాగే త‌మిళంలో ఓ రెండు చిత్రాలు ఈమె చేతిలో ఉన్నాయి. ఇక‌పోతే న‌య‌న‌తార త్వ‌ర‌లోనే ప్రియుడు, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్ట‌బోతోంది. వీరిద్ద‌రికీ ఇప్ప‌టికే నిశ్చితార్థం కూడా అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: