ఒమిక్రాన్ దెబ్బకు మొదలైన వాయిదాల పర్వం..?
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ను జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతే భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. అద్భుతమైన అంచనాలు ఉన్న ఈ చిత్రం విడుదలకు ఒమిక్రాన్ ఆటంకంగా మారుతుందేమోనన్న ఆందోళన అటు చిత్ర యూనిట్‌లోనూ ఇటు అందులో నటించిన స్టార్ హీరోల అభిమానుల్లోనూ కనిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత వారం గ్యాప్‌తో మరో ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన రాధేశ్యామ్ కూడా రావాల్సి ఉంది. అయితే జెర్సీ వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాల భవితవ్యం ఏంటో స్పష్టం కావాల్సి ఉంది. చిన్న సినిమాలపై ఒమిక్రాన్ ప్రభావం ఏమంత ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటిని విడుదల చేసేందుకు ఓటీటీ రూపంలో మెరుగైన ప్రత్యామ్నాయం ఉంది. కానీ భారీ చిత్రాలకు థియేటర్లలో విడుదల అయితేనే మనుగడ ఉండేది. వచ్చే వారం రోజుల్లోనూ వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉంటే ఈ చిత్రాలు విడుదల కావచ్చు. అయితే ఆ వెంటనే కేసులు పెరిగి ఆంక్షలు మొదలైతే మాత్రం మళ్లీ ఇబ్బందులు తప్పవు. ఏదేమైనా కోవిడ్ భూతం చిత్ర పరిశ్రమను ఇంకా వదలలేదన్న ఆవేదన పరిశ్రమ వర్గాల్లో కనిపిస్తోంది.