ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యువ నటి రష్మిక మందన్న ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ హిట్ మూవీ పుష్ప ది రైజ్. సుకుమార్ తీసిన ఈ సినిమాలో సునీల్, అజయ్ ఘోష్, ధనుంజయ, అనసూయ, అజయ్ తదితరులు ఇతర పాత్రలు చేయగా మలయాళ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ విలన్ పాత్రలో కనిపించారు. పుష్ప రాజ్ గా మాస్ పాత్రలో అల్లు అర్జున్ వండర్ఫుల్ యాక్టింగ్, శ్రీవల్లి పాత్ర లో తన అభినయం, అందంతో రష్మిక పెర్ఫార్మన్స్, దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, ఇతర పాత్రల సహజ నటన తో పాటు కథ కథనాలను అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా దర్శకడు సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించిన తీరు పుష్ప మూవీకి మంచి విజయాన్ని అందించాయి.
ఇక విడుదల రోజు నుండి చాలా ప్రాంతాల్లో మంచి కలెక్షన్ రాబడుతున్న పుష్ప, ఇప్పటికే రూ. 275 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుందని, నేడు ఈ సినిమా థాంక్యూ మీట్ లో భాగంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని మీడియా తో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు తమ సినిమా ఇంకా చాలా ప్రాంతాల్లో బాగా రన్ అవుతోందని అనే వార్తలు విన్నపుడు మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుందని, తప్పకుండా మూవీ రాబోయే రోజుల్లో మరింతగా దూసుకెళ్లి జనవరి మొదటి వారం సమయానికి మొత్తం రూ. 350 కోట్ల వరకు కలెక్షన్ కొల్లగొట్టే అవకాశం కనపడుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
నిజానికి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, సంగీత దర్శకుడు డిఎస్పీ, నిర్మాతలుగా తాము, డైరెక్టర్ సుకుమార్ మాత్రమే కాకుండా యావత్ మూవీ టీమ్ మొత్తం పడ్డ కష్టానికి ఫలితమే పుష్ప అద్భుత విజయానికి కారణం అని ఆయన అన్నారు. మరి పుష్ప యూనిట్ భావిస్తున్నట్లుగా ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంత మేర కొల్లగొడుతుందో చూడాలి. కాగా పుష్ప జనవరి లో ఓటిటి లో ప్రసారం అయ్యే ఛాన్స్ కనపడుతోంది.